విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనపై విచారణలో కేంద్రప్రభుత్వ విభాగాలనూ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి చెందిన పర్యావరణ, పరిశ్రమలు, కేంద్ర అటవీ పర్యావరణ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలకు చెందిన అధికారులను కూడా కమిటీలో సభ్యులుగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అక్కడినుంచి వచ్చే స్పందన ఆధారంగా విచారణలో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు మరో వారం రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌జీ దుర్ఘటనపై విచారణకు నీరభ్‌కుమర్ ప్రసాద్ ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విదేశీ యాజమాన్యం కావడం వల్లే..
దక్షిణకొరియాకు చెందిన యాజమాన్యం పర్యవేక్షణలో ఎల్‌జీ పాలిమర్స్ ఉంది. విదేశీ పెట్టుబడుల కింద ఏర్పాటైన పరిశ్రమ కావటంతో కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులనూ విచారణలో భాగస్వాములను చేయాలన్నది ప్రభుత్వ యోచన అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దుర్ఘటనపై నివేదికలను తయారు చేయడానికి కన్సల్టెన్సీ సంస్థలు కూడా లాక్‌డౌన్ వల్ల అందుబాటులో లేవు. వాటి కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హైపవర్ కమిటీ అధ్యయనం: కలెక్టర్
విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ ఆవిరి లీకేజీ ఘటనపై ఏడు కమిటీలు వివిధ కోణాల్లో విచారణ జరిపి ప్రాథమిక నివేదికలు ఇచ్చాయని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి తుది నివేదికను సిద్ధం చేస్తుందని అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన ‘ఈటీవీ-న్యూస్‌టుడే’తో మాట్లాడారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ బృందం నేరుగా విచారణ చేస్తోందని, నివేదికను ఎన్‌జీటీకే ఇస్తుందన్నారు. వెంకటాపురంలో కొంతమందికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వలేదన్న ఫిర్యాదులపై మాట్లాడుతూ..అటువంటిదేమీ లేదని, ఎవరైనా ఒకరిద్దరు మిగిలితే పరిశీలించి వారికి కూడా అందజేస్తామని చెప్పారు. నీరి కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రభావిత కాలనీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడంతో పాటు.. ప్రతీ ఇంటినీ హైపోక్లోరైట్ ద్రావణంతో పరిశుభ్రం చేయించామని చెప్పారు.
ఇదీ చదవండి: