ఆర్థిక శాఖ నుంచి లీకుల కారణంగా ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీన్ని నిరోధించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్థికశాఖలోని ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచడాన్ని నిలిపివేస్తూ ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా.. వివిధ సమావేశాల్లో అధికారులు రూపొందించే ప్రజెంటేషన్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. సమావేశాలు ముగిశాక ప్రజెంటేషన్ల వివరాలు ఎవరికీ అందుబాటులో లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, ఆన్‌లైన్‌లో జీవోల నిలిపివేత వంటి చర్యలు చేపట్టినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంతో పాటు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, పీఏసీ, రిజర్వు బ్యాంక్ వంటి వివిధ సంస్థల నుంచి ఈ వివరాలన్నీ బయటకు వస్తుండటంతో.. ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. వాస్తవానికి సీఎంఓలో జరిగే వివిధ సమీక్షా సమావేశాల్లో ఆర్థిక అంశాలపై చర్చించొద్దని అధికారులందరికీ వ్యక్తిగత ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి నేరుగా సీఎంతో లేదా సీఎంఓలోని అధికారులతో మాత్రమే చర్చించాల్సిందిగా స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇదీ చదవండి: