సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి.. నాడు-నేడు కింద పాఠశాలల్లో దశల వారీగా అభివృద్ధి పనులకు..21 వేల కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఆరు కేటగిరీల్లో పాఠశాల విద్య బోధించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు కొత్తగా 4,878 తరగతి గదులు మంజూరుకు తీర్మానం చేసింది. ఈనెల 16న జగనన్న విద్యాకానుక ద్వారా స్కూల్ యూనిఫామ్, బూట్లు, బెల్టు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని.. ఆగస్టు 10న మూడో విడత నేతన్న నేస్తం అమలు చేయాలని నిర్ణయించింది.
"నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నాం. ప్రాథమిక బడుల్లో ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నారు. అందరికీ ఒకే టీచర్ ఉండటం వల్ల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రాథమిక దశలోనే మంచి చదువు అందేలా విప్లవాత్మక చర్యలు చేపట్టాం. తెలుగు, ఆంగ్లంలో ఒకేసారి బోధన జరిగేలా చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రతి బడిలో తెలుగు తప్పక ఉంటుంది. పేదల పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోంది. పిల్లలను చదివించే తల్లులకు ఆర్థిక కష్టాలు ఉండకూడదనే అమ్మఒడి తీసుకొచ్చాం. ఆరు కేటగిరీలుగా విద్యాబోధన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పీపీ-1, పీపీ-2 కేటగిరీలుగా అంగన్వాడీ బడుల్లో విద్యా బోధన జరుగుతుంది. ఒక్క బడినీ మూసివేయం, ఒక్క టీచరు ఉద్యోగం కూడా పోదు "- మంత్రి పేర్ని నాని
రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్లు కలిగిన అగ్రిగోల్డ్ బాధితులకు.. రూ.500కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఏలూరు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో కొన్ని ప్రాంతాలు కలిపి 1560 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రుడాగా ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. పట్టణ ప్రాంతాల్లో 300 గజాల్లోపు అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు అంగీకరించింది. అసైన్డ్ భూముల విక్రయానికి సంబంధించిన చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. మచిలీపట్నం, భావనపాడు పోర్టు సవరించిన అంచనాలను కేబినెట్ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు.. అదనంగా 10 లక్షల పరిహారం చెల్లింపులకు ఆమోదం తెలిపింది. లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాలను హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
పులిచింతల గేట్ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. స్టాప్‌లాక్ గేట్, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై 20 నిమిషాలపాటు చర్చించారు. గతంలో వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన ప్రమాదాలపై కేబినెట్ సమావేశంలో మాట్లాడారు.
'పులిచింతల గేటుపై అధికారులు కేబినెట్‌కు తెలిపారు. పులిచింతలలో గతంలో ఇంత నీరు ఎప్పుడూ నిల్వ చేయలేదు. యాంత్రిక తప్పిదం వల్ల గేట్ విరిగినట్లు ప్రాథమిక నిర్ధరణ. హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల నిండుతుంది. కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.' -పేర్ని నాని
ఇదీ చదవండి: