అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం(ఆర్వోఎఫ్‌ఆర్) కింద పట్టాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అనుసరించిన విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని తెలంగాణకు చెందిన అధికారుల బృందం పేర్కొంది. అటవీ భూములపై హక్కులు కల్పించిన విధానంపై నివేదిక రూపొందించి తమ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని బృంద సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు అధికారుల బృందం... ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు రంజిత్ బాషాతో శనివారం సమావేశమైంది.
ఒకేసారి 2.29 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో అటవీ శాఖకు చెందిన భూముల్ని సాగు చేసుకుంటేనే పట్టాలిచ్చేవారని, ఈ సారి అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించామని రంజిత్ బాషా వివరించారు. 39 వేల ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చామని తెలిపారు. హక్కులు కల్పించిన భూముల్ని ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇప్పటికే సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందని తెలంగాణ అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీచదవండి. HRC: 'పోలీసుల దాష్టీకమే అబ్దుల్ సలాం ప్రాణం తీసింది'