శ్రీకాకుళం జిల్లాను కార్గో రంగానికి ముఖద్వారంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవలే భావనపాడు ఓడరేవు నిర్మాణానికి సంబంధించి రైట్స్ సంస్థ అందించిన డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూసేకరణకు, ఇతర ప్రక్రియను పూర్తిచేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ సూచించింది. మొదటి దశలో 3669 కోట్లు అంచనా వ్యయంతో నౌకాశ్రయం నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో మూడు జనరల్ కార్గో.. ఒక బల్క్ కార్గో బెర్తులు ఏర్పాటు చేసి... 2024-25 నాటికి 12, 18 ఎంటీపీఏ కార్గోను ఎగుమతి దిగుమతులు చేసే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెదేపా హయాంలోనే గెజిట్
2015 ఆగస్టులో 5 వేల ఎకరాల భూసేకరణ కోసం తెదేపా ప్రభుత్వం గెజిట్ ప్రకటన జారీ చేసింది. చర్చోపచర్చల అనంతరం 2 వేల 50 ఎకరాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడు, భావనపాడు గ్రామాలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి సంబంధించిన భూములను గుర్తించారు. రైతులు మాత్రం భూసేకరణకు సంబంధించి స్పష్టత కోరుతున్నారు. ఇదే విషయమై మంత్రులు ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు...కలెక్టర్ కార్యాలయంలో భావనపాడు ప్రాంత ప్రజలతో సమీక్ష నిర్వహించారు. పోర్టుకు వ్యతిరేకం కాదన్న భావనపాడు ప్రజలు.. సంతృప్తికర ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమలు వస్తాయి...
భావనపాడు పోర్టు నిర్మాణం చేపడితే.. కార్గో రంగంతో పాటు ఇతర అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాకు తరలి వస్తాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మాణం చేపడతామన్న ఆయన అందరూ కలిసి రావాలని కోరారు. దేవునల్తాడ గ్రామానికి చెందిన సీదిరి అప్పలరాజు ప్రస్తుతం మంత్రివర్గ సభ్యుడు కావడంతో...రైతులకు, మత్య్యకారులకు సంబంధించిన ప్రాధాన్యతలను ప్రభుత్వానికి నేరుగా నివేదించేందుకు వీలైందని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి