ఆ రాష్ట్రం వారు వద్దంటే.. ఈ రాష్ట్రం వారు కావాల్సిందే అంటారు..! మీ ప్రాజెక్టులు అక్రమమని ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తే... కాదు కాదు మీ ప్రాజెక్టులే అక్రమ నిర్మాణాలంటూ మరో ప్రకటన. విద్యుదుత్పత్తి అపాలని ఏపీ సర్కార్.. ఆపేదే లేదంటూ తెలంగాణ..! అధికార పార్టీ నేతలే కాదు.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. ఏపీ మంత్రులు మాట్లాడితే.. తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు మాట్లాడితే... ఏపీ మంత్రులు, అధికార పార్టీల నేతల విరుచుకుపడ్డారు. పోలీసుల పహారాతో ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి..! ఇదీ గత కొన్నాళ్లుగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం..! తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను కూడా ఆశ్రయించింది. ఇలా వాటర్ వార్ జరుగుతున్న క్రమంలో... కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. మరీ జల్‌శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..?
ఒక్క నది.. నాలుగు రాష్ట్రాలు..
కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. కొంత కాలం కిందట ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపొతల పథకం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమని.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లెవనెత్తింది. కాదు.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. ఏపీ సర్కార్ గళమెత్తింది. సీమ జిల్లాలను సస్యశామలం చేయాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమని తేల్చిచెబుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించటంతో పాటు వెంటనే ఆపేయాలని కోరింది. రాయలసీమ ఎత్తిపోతలు ఒక్కటే కాకుండా, ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించాలని కృష్ణా బోర్డుని ఏపీ జలవనరుల శాఖ కోరింది. ఈ పరిశీలనపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలు కూడా రాసింది ఏపీ సర్కార్. అదే సమయంలో కమిటీని నియమించి, రాయలసీమ ఎత్తిపొతల పనుల పరిశీలనకు సిద్ధమయిన కేఆర్ఎంబీ చైర్మన్ వైఖరిని కూడా తప్పుబట్టింది. ఛైర్మన్‌ని తొలగించాలని కూడా జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఇలా నడుస్తున్న వ్యవహరంలో శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తిని కొనసాగించటం కొత్త వివాదానికి దారి తీసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. విద్యుదుత్పత్తిని చేపట్టడం సరికాదంటూ తెలంగాణ సర్కార్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ అంశాలపై సీఎం జగన్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖలు రాశారు. తక్షణమే తెలంగాణ చర్యలను ఆపాలని జగన్ కోరారు.
వివాదంలో కీలక మలుపు
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో కేంద్ర జల్‌శక్తిశాఖ.. రంగంలోకి దిగింది. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై 71 ప్రాజెక్టులూ.. ఆయా బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయని పేర్కొంటూ గెజిట్‌ను విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. వచ్చే అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా.. వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ప్రస్తావించటం ఆసక్తికరం.
స్వాగతించిన ఏపీ
కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తమ హక్కులను కాపాడుతుందని ఏపీ జలవనరుల శాఖ అభిప్రాయపడింది. గెజిట్‌ను స్వాగతిస్తున్నామని ఆ శాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. నోటిఫికేషన్‌లోని చిన్న చిన్న తప్పిదాలున్నాయని.. వాటి సరి చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రాయలసీమ ఎత్తిపొతల పథకాన్ని నోటిఫై చేస్తే ఒక రకమైన లాభం.. చేయకుంటే మరో రకమైన లాభం ఉంటుందని జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్పందనపై ఆసక్తి..!
కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై తెలంగాణ సర్కార్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చాలనే ప్రతిపాదనను మొదటినుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సీఎం కేసీఆర్ సమీక్ష..
తాజా పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ, ఏజీ, అదనపు ఏజీలు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్‌పై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెరాస ఎంపీలతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ నదీ జలాల హక్కులను కాపాడుకోవటం కోసం పార్లమెంట్లో గళమెత్తటం.. మరోవైపు గెజిట్‌పై న్యాయపోరాటానికి ముందుకెళ్లటం వంటి అంశాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖ
కొత్త ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను గోదావరి బోర్డు (godavari river management board) కోరింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బోర్డు లేఖ రాసింది. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్, జూన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్‌లు ఇచ్చేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయని లేఖలో ప్రస్తావించింది.
సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు లోబడి పట్టిసీమ, పురుషోత్తమపురం ఎత్తిపోతల డీపీఆర్‌లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఎలాంటి డీపీఆర్‌లు అందలేదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా డీపీఆర్‌లు సమర్పించాలని రెండు రాష్ట్రాలను గోదావరి బోర్డు కోరింది.
అనుబంధ కథనాలు: