Private security agencies: ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల కార్యకలాపాల నియంత్రణకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం(పీఎస్‌ఏఆర్‌ఏ), 2005కు సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కేంద్ర హోంశాఖ రూపొందించిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ సెంట్రల్ మోడల్ రూల్స్, 2020కి అనుగుణంగా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం లైసెన్సుల కోసం ఏజెన్సీల దరఖాస్తు ప్రక్రియ మొదలుకొని సెక్యూరిటీగార్డుల ఎంపిక వరకు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏజెన్సీల పనితీరును ఆన్‌లైన్‌లో పీఎస్‌ఏఆర్‌ఏ వెబ్‌పోర్టల్ ద్వారా పకడ్బందీగా పర్యవేక్షించేలా ఏర్పాటు ఉండనుంది. లైసెన్సు పొందాక ఏజెన్సీల నిర్వహణ కోసం నిర్వాహకులు తప్పనిసరిగా మూడు నెలల శిక్షణ పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ అకాడమీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లైసెన్సు పునరుద్ధరణ గడువు ముగిసేందుకు 45 రోజుల ముందే ఆన్‌లైన్‌లో తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉండనుంది.
ఎంపికలో సాంకేతిక పద్ధతిలో వడపోత :
సెక్యూరిటీగార్డులు, సూపర్‌వైజర్ల ఎంపికలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. చేర్చుకునేముందు వారి ప్రవర్తన గురించి తెలుసుకునేందుకు ఏజెన్సీల నిర్వాహకులకు పోలీస్‌శాఖ సహకరించనుంది. వారికేమైనా నేరచరిత్ర ఉందా అనేది పరిశీలించేందుకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్స్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్‌ఎస్), ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్(ఐసీజేఎస్) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
* సెక్యూరిటీగార్డులు, సూపర్‌వైజర్లకు ఎంపిక చేసిన అకాడమీల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాథమిక స్థాయిలో 28 పనిదినాల్లో కనీసం 100 గంటల తరగతి గది శిక్షణ, 60 గంటల క్షేత్రస్థాయి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ సైనిక ఉద్యోగులకు, మాజీ పోలీసులకు శిక్షణలో పాక్షిక మినహాయింపు ఇవ్వనున్నారు.
* శారీరక దారుఢ్యం పెంచుకోవడం, గుంపుల్ని నియంత్రించడం(క్రౌడ్ కంట్రోల్), ఆయుధాల రకాల్ని తెలుసుకొని ఉండడం, పోలీస్ అధికారుల బ్యాడ్జిల ఆధారంగా హోదాను గుర్తించడం, పాస్‌పోర్టులు, స్మార్ట్‌కార్డుల వంటి వాటిని తనిఖీ చేయడం లాంటి అంశాల్లో వీరికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది.
కనీసం 8వ తరగతి పాసైతేనే:
సెక్యూరిటీ గార్డుల ఎంపికకు కనీస విద్యార్హత 8వ తరగతి ఉత్తీర్ణత ఉండనుంది. సూపర్‌వైజర్‌గా పనిచేసేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే కనీసం రెండేళ్లపాటు గార్డుగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
* 160 సెం.మీ.ల ఎత్తు(మహిళలు 150 సెం.మీ.) తప్పనిసరి. పురుషులు 80 సెం.మీ.ల ఛాతీ కొలత కలిగి ఉండాలి. ఆరు నిమిషాల్లో కిలోమీటర్ దూరం పరిగెత్తగలగాలి. నిర్ణీత ప్రమాణంలో దృష్టి, వినికిడి లోపం లేకుండా ఉండాలి.
* గరిష్ఠంగా ప్రతీ పదిహేను మంది సెక్యూరిటీగార్డులను పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్ తప్పనిసరి. ప్రతీ గార్డుకు హాలోగ్రామ్‌తో కూడిన ఐడీకార్డు ఉండాలి.
తెలంగాణాలో 658 ఏజెన్సీలు:
పీఎస్‌ఏఆర్‌ఏ పోర్టల్‌లోని సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 32,446 లైసెన్సులు జారీ కాగా వీటిలో 18,634 మాత్రమే ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నాయి. 13,812 ఏజెన్సీల లైసెన్సులు రద్దయ్యాయి. తెలంగాణాలో 680 లైసెన్సులకు 658 పనిచేస్తుండగా 22 ఏజెన్సీల లైసెన్సు గడువు తీరిపోయింది.
ఇవీ చదవండి: