శాంతియుతంగా, అహింసామార్గంలో 310 రోజులుగా జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి విమర్శించారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో మూడు రాజధానులకు మద్ధతుగా దీక్షలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే గద్దెదిగే వరకు తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి మోదీ చూపు అమరావతివైపు తిరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. రాజధాని ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసు కవాతు నిర్వహించడం దురదృష్టకరమని విమర్శించారు.
కొంతమంది మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకు అమరావతిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి పదవులు శాశ్వతం కాదని, ఇప్పటికైనా మంత్రుల తమ వైఖరిని విడనాడి రాజధాని అమరావతికి మద్ధతు పలకాలని శివారెడ్డి కోరారు. ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రాంతాలు, కులాలు, వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతుందని శివారెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి : కావలిలో రియల్ మాఫియా...గ్రావెల్ దందా!