Amaravati Farmers padayatra: తుగ్లక్ ప్రభుత్వాన్ని గద్దె దించకుంటే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందన్నారు అమరావతి ఐకాస నేతలు. రాజధాని విషయంలో సీఎం జగన్ విధానాలను కోర్టులు తప్పు పట్టినా.. మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మలివిడత మహాపాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. సీఎం స్వలాభం కోసమే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
పాదయాత్రలో పాల్గొనేందకు యాప్: హైకోర్టు తీర్పు తర్వాత కూడా పార్లమెంట్లో వైకాపా ఎంపీ చేత ప్రయివేటు బిల్లు పెట్టించటం మహా తుగ్లక్ నిర్ణయం అంటూ ధ్వజమెత్తారు.మహా పాదయాత్ర రెండో విడత పాదయాత్ర ఆవశ్యకతను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొనేవారు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ను ఆవిష్కరించారు. 'రాష్ట్రాన్ని రక్షించుకుందాం - రాజధానిని కాపాడుకుందాం' నినాదంతో అమరావతి రెండో విడత పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
డీజీపీ అనుమతి కోసం: అమరావతి నుంచి అరసవల్లికి సెప్టెంబర్ 12నుంచి రెండో విడత మహాపాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు. రెండు రోజుల్లో పాదయాత వివరాలను డీజీపీకి అందచేస్తామన్నారు. డీజీపీ స్పందనను బట్టి తదుపరి చర్యలుంటాయని రైతు నేతలు స్పష్టం చేసారు. అమరావతే ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటిస్తే.. తమ ఆందోళనలు, నిరసనలు విరమించుకుంటామని ఐకాసా నేతలు పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యతు కోసం: ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అమరావతి ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించే అన్ని జిల్లాల వారు తమ పాదయాత్రలో పాల్గొనవచ్చని తెలిపారు. మొదటి దశ పాదయాత్రలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. రెండో విడత పాదయాత్ర చేపడతామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. అమరావతి అంతం కోరుకుంటున్న జగన్ రెడ్డి అంతు చూసేందుకే రెండో విడత పాదయాత్ర అని ఐకాస నేతలు మండిపడ్డారు. అమరావతి సాధన కోసం దళిత బహుజన ఫ్రంట్ సభ్యులు పార్టీలు, రాజకీయాలకతీతంగా పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.
ఇవీ చూడండి:
- నీతీశ్ అలా చేస్తే ప్రచారం మానేస్తానన్న పీకే
- బీచ్లో అనుమానిత బోటు, లోపల ఏకే47 గన్స్, అసలేమైంది
- బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు, ఆవేదనతో పోస్ట్