రాజధాని అమరావతిలో తూర్పున వెలుగురేఖలు ప్రసరించక ముందే... ఉద్యమ శంఖారావాలు ప్రతిధ్వనించాయి. జై అమరావతి... జయహో అమరావతి... నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి... అమరావతి నుంచి అరసవల్లి దాకా రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం ఉదయం గోవింద నామాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, రైతుకూలీలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా తప్ప మిగతా రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. దారిపొడవునా వివిధ గ్రామాల్లో పాదయాత్రకు జేజేలు పలికారు. గ్రామస్థులు కొబ్బరికాయలు కొట్టి, గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతులిచ్చి, పూలుచల్లి స్వాగతించారు. ఉదయం 6.03 గంటలకు వెంకటపాలెం సమీపంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయం నుంచి మొదలైన పాదయాత్ర... వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు మీదుగా సాయంత్రం 6.15కి మంగళగిరి చేరుకుంది.
ఆలయం తెరిచేందుకు నిరాకరణ
వెంకటపాలెం సమీపంలోని శ్రీవారి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్న నిర్వాహకులు ఆ విషయాన్ని సిబ్బందికి ముందే తెలిపారు. సోమవారం వేకువజామున ఐదింటికే అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాస నాయకులు, రాజధాని గ్రామాల మహిళలు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. సిబ్బంది తలుపులు తెరిచేందుకు నిరాకరించారు. ఆలయ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకు తలుపులు తెరుస్తామని, 6.30 నుంచి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. ముందే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 6.03 గంటలకే పాదయాత్రను ప్రారంభించాల్సి ఉండటంతో... ఐకాస నాయకులు, మహిళలు దేవస్థానం ధ్వజస్తంభం దగ్గరే పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
జయజయధ్వానాలతో కదిలిన రథం
రాజధాని మహిళలు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి శంఖం పూరించారు. సూర్యుని రథాన్ని పోలిన విధంగా సప్తాశ్వాలతో... శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరుడు కొలువుతీరిన రథాన్ని మంగళవాయిద్యాల మధ్య ఉదయం 6.03 గంటలకు కదిలించారు. రథాన్ని నడిపే బాధ్యతను వైకాపా మద్దతుదారులకు అప్పగించడంపై కొందరు అభ్యంతరం చెప్పడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐకాస నాయకులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగి రథం వెంకటపాలెంవైపు కదిలింది. ఉదయం 7.20కి రైతులు వెంకటపాలెం చేరుకున్నారు. అల్పాహారం కోసం అక్కడ ఆగారు. మళ్లీ 9 గంటలకు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఐకాస నాయకుడు శివారెడ్డి తదితరులు గుమ్మడికాయ కొట్టి, జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. మహిళలు 108 గుమ్మడికాయలు కొట్టారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, భాజపా నేతలు కామినేని శ్రీనివాస్, పాతూరి నాగభూషణం, తెదేపా నాయకుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెదేపా నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు... వెంకటపాలెం నుంచి కొంతదూరం శ్రీవారి రథాన్ని నడిపారు.
వివిధ పార్టీల నాయకుల సంఘీభావం
తొలిరోజు రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన వారిలో... కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, పార్టీ నాయకుడు మస్తాన్‌వలి, తెదేపా నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, నెట్టెం రఘురాం, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు సీహెచ్ బాబూరావు, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకుడు అజయ్‌కుమార్, భాజపా నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్, పాటిబండ్ల రామకృష్ణ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసయాదవ్, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృష్ణాయపాలెం నుంచి పాదయాత్రలో పాల్గొంటారని ముందు ప్రకటించినా, అనారోగ్యం కారణంగా ఆయన హాజరవలేదు. రేణుకా చౌదరి కొంతదూరం రథాన్ని నడిపారు. ఉదయం 10 గంటలకు పాదయాత్ర కృష్ణాయపాలెం చేరుకుంది. గ్రామస్థులు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి, ట్రాక్టర్ల నిండా తెచ్చిన పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. రైతుల ఉద్యమానికి సంకేతంగా ఆకుపచ్చ బెలూన్లను భారీగా గాల్లోకి వదిలి మద్దతు ప్రకటించారు. పెనుమాకలోనూ ఘన స్వాగతం లభించింది. మహిళలు ఇళ్లముందు మంచినీటి క్యాన్లు పెట్టుకుని, పాదయాత్రికుల దాహం తీర్చారు. ఎర్రబాలెంలో మహిళలు కోలాటం వేస్తూ పాదయాత్రకు స్వాగతం పలికారు. పలుచోట్ల ఇళ్ల పైకప్పుల నుంచి పూలు చల్లారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మద్దతు
చిత్తూరు, కందుకూరు తదితర ప్రాంతాలే కాకుండా, తెలంగాణ నుంచీ కొందరు వచ్చి పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. కొందరు న్యాయవాదులు పాదయాత్రలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలో పాదయాత్రకు స్థానిక ప్రజలు, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ జేఏసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జేఏసీ నాయకులు ‘నారా హమారా... అమరావతి హమారా...’ నినాదాలతో రూపొందించి ప్రత్యేక జెండాలు, ఫ్లెక్సీలను ప్రదర్శించారు. న్యాయవాదులు కొందరు గులాబీలు అందించి రైతులకు స్వాగతం పలికారు. మంగళగిరిలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలతో పాదయాత్రకు స్వాగతం పలికి, కొంతదూరం నడిచారు. పాదయాత్రలో శ్రీవారి రథం ముందు ప్రజలు కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు సమర్పించుకున్నారు. పెద్ద ఎల్‌ఈడీ తెర అమర్చిన వాహనం పాదయాత్ర ముందు సాగింది. దానిపై ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా స్వాగతిస్తూ శాసనసభలో జగన్ చేసిన వ్యాఖ్యలు, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు ముందు రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు చేసిన వ్యాఖ్యల వీడియోల్ని ప్రదర్శించారు.
పోలీసుల డేగకన్ను
పాదయాత్ర మొత్తాన్ని పోలీసులు వీడియో తీశారు. డ్రోన్ కెమెరాలతోనూ చిత్రీకరించారు. తొలిరోజు ఎక్కడా ఎలాంటి అవరోధమూ కలిగించలేదు. కృష్ణాయపాలెం వంటి చోట్ల ప్రధాన కూడళ్ల దగ్గర ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నియంత్రించారు.
ఈ రాష్ట్రంలో ఎందుకుండాలి?
ఈ చిత్రంలోని కవలల పేర్లు ముప్పాళ్ల అనూహ్య, అనూహ. వీరిది రాజధానిలోని మందడం గ్రామం. వీరిద్దరూ బీటెక్ చదువుకుని... విజయవాడలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకి సిద్ధమైన హెచ్‌సీఎల్ సంస్థ... కొందర్ని ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేసి శిక్షణ ప్రారంభించింది. అలా ఎంపికైన వారిలో వీరూ ఉన్నారు. అంతా సక్రమంగా, జరిగి రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే... వీరిప్పుడు హెచ్‌సీఎల్ కంపెనీ ఉద్యోగులుగా స్థిరపడి ఉండేవారు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానలతో హెచ్‌సీఎల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వీరి తల్లిదండ్రులూ రాజధానికి భూములిచ్చారు. ప్రస్తుతం యువతులిద్దరూ ఒకేరకం దుస్తులు ధరించి పాదయాత్రలో పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మాతోపాటు బీటెక్ చదువుకున్నవారంతా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు. మా తోటి విద్యార్థులను అడిగితే... ఏపీలో ఏముంది? ఎందుకు ఇక్కడ ఉండాలి? వేరే రాష్ట్రానికిగానీ, దేశానికి కానీ వెళితే భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. అమరావతిలో అభివృద్ధి జరిగితే వారూ ఇక్కడే ఉండేవారు కదా?’ అని కవలలు అన్నారు.
కువైట్ నుంచి వచ్చి....
కువైట్‌లో స్థిరపడిన ముప్పాళ్ల జ్యోత్స్నది ఏలూరు. ఆమె తల్లిదండ్రుల్ని చూడటానికి వచ్చినప్పుడల్లా... రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి విని చలించిపోయేవారు. గత ఏడాది అమరావతి నుంచి తిరుపతి దాకా రైతులు చేసిన పాదయాత్రకు ఆమె కువైట్ నుంచి వచ్చి సంఘీభావం తెలిపారు. కొన్ని రోజులు యాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ కువైట్ నుంచి వచ్చారు. ‘రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సిందిపోయి... ఇబ్బందులకు గురిచేయడం దారుణం. అందుకే వారికి మద్దతు తెలిపేందుకు వచ్చా’ అని జ్యోత్స్న చెప్పారు.
తోటి తెలుగువాడిగా...
తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చెందిన పి.విజయకుమార్ ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వాలు హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో నా ముగ్గురు పిల్లలు ఐటీ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సీఎం జగన్ అమరావతిలో అభివృద్ధిని కొనసాగిస్తే... ఐటీతో పాటు, పలు పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు లభించేవి. కానీ మూడు రాజధానులంటూ విధ్వంసం సృష్టించారు. ఒక తెలుగువాడిగా అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చా’ అని విజయకుమార్ చెప్పారు.
ఇవీ చదవండి: