MahaPadayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర జైత్రయాత్రలా ముందుకు సాగుతోంది. 42వ రోజున శ్రీకాళహస్తి సమీపంలోని అంజిమేడు నుంచి మహాపాదయాత్ర మొదలైంది. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్‌నాయక్ సాయితేజకు నివాళులు అర్పించి రైతులు నడక మొదలుపెట్టారు. మండుటెండ, వాన.. వేటినీ లెక్కచేయకుండా లక్ష్యం దిశగా అన్నదాతలు దూసుకెళ్లారు. అన్ని ప్రాంతాల నుంచీ వస్తున్న సంపూర్ణ మద్దతుతో.. జై అమరావతి నినాదం జోరందుకుంది. 42వ రోజున 11 కిలోమీటర్ల పాటు నడిచిన రైతులు.. రేణిగుంట చేరుకున్నారు. ప్రజలు అడుగడుగునా పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
అమరావతి రైతుల్లో కొందరు.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధురాలు, భుజానికి తీవ్రగాయంతో బాధపడుతున్న మరో మహిళ.. ఇలా అనేక మంది.. ఆరోగ్య సమస్యల్ని లెక్కచేయకుండా పట్టుదలతో నడుస్తున్నారు. అమరావతి ఆశయం ముందు అనారోగ్యం పెద్ద సమస్య కాదంటున్నారు.
అమరావతి రైతులకు సంఘీభావంగా.. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు పాదయాత్రలో పాల్గొన్నారు. రాయలసీమ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే.. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని స్పష్టం చేశారు.
రేణిగుంట సమీపంలో పోలీసులు పాదయాత్రపై ఆంక్షలు కఠినతరం చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మల్లవరం వద్ద స్థానికులు నేలను పూలతో అలంకరించి.. ఆకుపచ్చ బెలూన్లతో రైతులకు స్వాగతం పలికారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన ప్రజలు.. రైతులతో కలిసి నడిచారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ.. హారతులు పట్టి స్వాగతం పలికారు. వాహనాల్లో వెళ్తున్న అయ్యప్ప భక్తులు, వివిధ ప్రాంతాల వారు కూడా పాదయాత్రకు మద్దతు తెలిపారు.
అంజిమేడు నుంచి పాదయాత్ర ప్రారంభించిన రైతులు.. గుత్తివారిపల్లిలో భోజన విరామం తీసుకున్నారు. తర్వాత వేదళ్ల చెరువు, గురవరాజుపల్లె మీదుగా రేణిగుంట చేరుకున్నారు. రైతుల మహాపాదయాత్ర సోమవారం తిరుపతి వరకూ సాగనుంది.