రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం క్రమంగా వేడెక్కుతోంది. 256వ రోజూ వివిధ రూపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. తుళ్లూరులో రైతులు, మహిళలు రాజధాని అమరావతిని కాపాడాలంటూ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి లేఖలు రాశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినందుకు దగా పడ్డామన్న రైతులు... 3 రాజధానుల నిర్ణయంతో తమ జీవితాలను అగమ్యగోచరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో తమకు సామూహిక మరణాలకు అనుమతివ్వాలని వేడుకున్నారు.
కౌలు కోసం వెళ్తే కొట్టారని, అరెస్టులు చేశారని గుర్తుచేసిన రైతులు, మహిళలు... ఆలస్యంగా కౌలు ఇచ్చి పాలాభిషేకాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. గతంలో ఎప్పుడూ సాధారణంగానే కౌలు సొమ్ము ఇచ్చేవారని రైతులు, మహిళలు గుర్తు చేశారు. రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడే నిరసనోద్యమాలు జరుగుతుండగా... ఇకపై మరింతగా స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రైతులు, మహిళలు సమాయత్తమవుతున్నారు.
ఇదీ చదవండీ... రాజధానిపై కౌంటర్ దాఖలుకు జనసేన నిర్ణయం