'రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్' - ఏపీ కరోనా న్యూస్
రాష్ట్రంలో 161 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీరిలో దిల్లీ నుంచి వచ్చిన వారు 140 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రం నుంచి దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరైన 946 మందిలో 881 మందిని గుర్తించామన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధ పడకూడదనే... ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకునే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌తోపాటు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉండేలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయంగా చెప్పారు. లబ్ధిదారులందరికీ రూ. 1000 ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న మంత్రి... ఇందులో 140 మంది దిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మిగిలిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారని వివరించారు. దిల్లీకి వెళ్లిన 1081 మందిలో 946 మంది రాష్ట్రంలో ఉన్నారని... మిగిలిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. 881 మందిని గుర్తించి నమూనాలు పరీక్షకు పంపామని...108 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని వివరించారు.
సోమవారం నుంచి విశాఖ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తామన్న మంత్రి... ఈ కేంద్రంతో రాష్ట్రంలో మొత్తం 7 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇకపై రోజుకు 500 పరీక్షలు చేసే అవకాశం లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి: