ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పది శాతం రిజర్వేషన్లను... తెలంగాణలోనూ అమలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకొంది. అందుకు అనుగుణంగా విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటగా వైద్యవిద్య కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. జాతీయ స్థాయి నీట్ పరీక్ష ద్వారా ప్రవేశాలు, పది శాతం అదనపు సీట్లకు అవకాశం ఉన్నందున... కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ఉద్యోగ నియామకాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపజేస్తూ.. 2021 ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. వాటికి కొనసాగింపుగా మార్గదర్శకాలు ఖరారు చేస్తూ మార్చి 19న మరో ఉత్తర్వు వెలువరించారు.
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పది శాతం రిజర్వేషన్ల కోసం నిబంధనలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 8 లక్షలపైన వార్షిక ఆదాయ పరిమితి ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొన్నారు. ఐదు ఎకరాలకు మించి వ్యవసాయ భూములు ఉన్న... వెయ్యి చదరపు అడుగులు ఆపై నివాస ఫ్లాట్ ఉన్న... అర్హులు కారని... అలాగే పట్టణ ప్రాంతాల్లో వంద చదరపు అడుగులపై ఇంటి స్థలం.. ఇతర ప్రాంతాల్లో 200 అడుగుల పైన ఇంటి స్థలం ఉన్న వారు... ఇందుకు అర్హులు కారని అందులో పేర్కొన్నారు.
విజ్ఞప్తుల ఆధారంగా సవరింపులు...
అయితే వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నిబంధనలతో చాలా మంది పది శాతం రిజర్వేషన్లకు దూరం అవుతారని అభిప్రాయపడ్డారు. మార్గదర్శకాలను సవరించాలని, సరళీకృతం చేయాలని కోరారు. వాటిపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మార్గదర్శకాలను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులని తీర్మానించింది. ఇదే సందర్భంలో ఈ కోటా కింద ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని.. ఐదేళ్ల పాటు సడలించాలని నిర్ణయించారు.
త్వరలోనే ఉత్తర్వులు..
కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ కసరత్తు చేసింది. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి అనుగుణంగా త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
ఇవీ చూడండి: