అబద్ధాలకు ఆస్కార్ ఉంటే భాజపాకే దక్కుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెరాస అభ్యర్థి సుజాతకు మద్దతుగా ధర్మాజిపేటలో జరిగిన ప్రచారసభకు ఆయన హాజరయ్యారు. బీడీ కార్మికులకు కేంద్రం పింఛన్లు ఇస్తున్నట్లు భాజపా నాయకులు చెప్పుకుంటున్నారన్న ఆయన... వాస్తవం తేల్చాలని సవాల్ విసిరితే తోకముడిచారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో సొంత సీటును గెలిపించుకోలేకపోయిన కాంగ్రెస్‌కు దుబ్బాక ప్రజలు అదేతీరుగా సమాధానం చెబుతారన్నారు.
దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం: కిషన్‌రెడ్డి
దుబ్బాక ఉపఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా ప్రజల మద్దతుపై ఆధారపడి పోటీ చేస్తుంటే... తెరాస అధికారంపై ఆధారపడిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా.. లేకున్నా తేడా లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నవంబర్ 3న దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం జరగనుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజలు ఏవగించుకుంటున్నారు: ఉత్తమ్
దుబ్బాక తీర్పు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా రఘోత్తంపల్లిలో ప్రచారం నిర్వహించిన ఆయన... తెరాస, భాజపాలను ప్రజలు ఏవగించుకుంటున్నారని విమర్శించారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో పార్టీ నేత వీహెచ్ ప్రచారం నిర్వహించారు.
తలమునకలైన అధికార యంత్రాంగం
మరో వైపు పోలింగ్ సమయం ఆసన్నమవుతుండటంతో... అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్ననమైంది. పోలింగ్ పరిశీలకులు సరోజ్‌కుమార్‌తో పాటు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి సమావేశమయ్యారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల గురించి వారు చర్చించారు.
ఇవీ చూడండి: