హైదరాబాద్ శివారు.. అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)ను ఆనుకొని.. హిమాయత్‌సాగర్ ఒడ్డున.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ గ్రామమది. 8 దశాబ్దాల కిందట ఏర్పడింది. 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామస్థులు పైసాపైసా కూడబెట్టి భూములు కొనుక్కున్నారు. కొందరికి రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారు చట్టం కింద పట్టాలిచ్చింది. ఈ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా నిర్మించింది. ఉన్నట్టుండి ఊళ్లో అలజడి! నడుస్తున్న నేల తమది కాదేమోనని.. తలదాచుకుంటున్న ఇల్లు పోతుందేమోనని.. జీవనాధారమైన పొలం లాక్కుంటారేమోనని గ్రామస్థులు భయపడుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న తాఖీదులే అందుకు కారణం.
కొత్వాల్‌గూడ భూములపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (ముంబయి) నుంచి తాజాగా అసిస్టెంట్ కస్టోడియన్ ప్యాట్రిసియా ఫియల్హో గ్రామానికి వచ్చారు. సర్వే నంబర్ల వారీగా హక్కుదారులకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే 30 మందికి అందజేశారు. భూములన్నీ కాందిశీకులవని, ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ తాఖీదుల్లో పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే నేరుగా కస్టోడియన్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సెపి)కి మెయిల్ లేదా స్పీడ్‌పోస్టులో ఈనెల 30 సాయంత్రంలోగా చెప్పాలంటున్నారు. ఆలోగా హక్కుదారులమని పత్రాలు పంపించకపోతే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. తాఖీదులు అందుకున్న వారిలో ఓ ఎమ్మెల్సీ ఉన్నట్లు సమాచారం.
ఇదీ వివాదం
కొత్వాల్‌గూడలో సర్వే నం.2, 13-15, 17, 18, 20-30, 32, 34, 35, 38, 41-53, 55-93, 96-99, 102-105, 108-113, 118-123, 153-174లలో 1301.44 ఎకరాలున్నట్లు సెపి చెబుతోంది. వీటి తొలి పట్టాదారు సయిద్ మొహ్మద్ హసన్ అబేదీ అంటోంది. ఆయన్నుంచి కుమారుడు కమ్రుద్దీన్‌హసన్, కుమార్తెలు సయీద్ ఫౌజియా, మునీరున్నీసా బేగంకు దఖలు పడ్డాయి. 1967లో కమ్రుద్దీన్ పాకిస్థాన్‌కు వెళ్లిపోగా, 1968లో హసన్ అబేదీ మరణించారు. 1968లో వచ్చిన ఎనిమీ ప్రాపర్టీ ఆస్తి చట్టం ప్రకారం 1972 అక్టోబరు 21న కమ్రుద్దీన్ పేరిట ఉన్న 640 ఎకరాలను అప్పటి హైదరాబాద్ పశ్చిమ తహసీల్దార్ అప్పగించినట్లుగా సెపి చెబుతోంది. ప్రస్తుతం వీటి విలువ రూ.2500 కోట్లు ఉంటుందని అంచనా.
ఎనిమీ ప్రాపర్టీ అంటే..
1965లో పాకిస్థాన్‌తో యుద్ధం తర్వాత భారతీయులు ఎవరైనా పాక్‌కు వెళ్లేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. అలా వెళ్లిన వారి స్థిరచరాస్తులు కేంద్రానికే చెందుతాయని ఆఏడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఆస్తులు, భూముల బాధ్యతను సెపికి అప్పగించింది.
ఓఆర్‌ఆర్ సైతం ఆ భూముల్లోనే..
కొత్వాల్‌గూడలోని కాందిశీకుల భూముల్లోంచే బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్ )నిర్మించారు. దీనిపై 2008లోనే సెపి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి తమకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని, చెల్లించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకూ చెల్లించలేదు.
కేంద్రానికి నివేదిస్తా
మా రికార్డుల్లోని సర్వే నంబర్ల ప్రకారం సంబంధితులకు నోటీసులిస్తాం. గ్రామస్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం.
ప్యాట్రిసియా ఫియల్హో, అసిస్టెంట్ కస్టోడియన్, సెపి
80 ఏళ్ల నుంచి ఉంటున్నాం
80 ఏళ్లుగా మా కుటుంబాలన్నీ ఇక్కడే ఉంటున్నాయి. మేం శంషాబాద్‌లోని భూమిని అమ్ముకుని.. హసన్ అబేదీ నుంచి ఈ భూమి కొనుగోలు చేశాం.
- కరణం కృష్ణయాదవ్, గ్రామస్థుడు
ఆత్మహత్యలే శరణ్యం
మా తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఈ సాగు భూములే మాకు జీవనాధారం. లాక్కొంటే ఆత్మహత్యలే శరణ్యం. నోటీసులేవీ మాకు అందలేదు.
- సిద్ధాంతి కృష్ణ, కొత్వాల్‌గూడ
- ఇదీ చదవండి : KRISHNA BOARD MEETING: నేడు కృష్ణాబోర్డు సమావేశం