పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల పరిధిలో 5 లక్షల 5 వేల 565 మంది ఓటర్లు ఉండగా... 11 జిల్లాల పరిధిలో 731 కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధివిధానాలు నిర్దేశించి... సామగ్రిని అందించారు. నల్గొండ జిల్లాకు సంబంధించినవి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేశారు. సూర్యాపేటవి స్థానికంగా ఉన్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో పంపిణీ చేశారు. దాదాపు 3,500 మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు.
పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సామగ్రిని తీసుకుని....అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా....లక్షా 81 వేల 313 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లిలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుమారు 100 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొంటారని చెప్పారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు...
ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ పంపిణీ కేంద్రంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందించారు. మెుత్తం లక్షా 29 వేల 851 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 44 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని అదనపు కలెక్టర్ మధుసూదన్ వెల్లడించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని.... వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
17న కౌంటింగ్...
పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ఈ నెల 17న కౌంటింగ్ చేయనున్నారు.
ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'