Horticultural crops: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన రైతు అజీమ్ ఉల్లా తనకున్న ఐదెకరాల పొలంలో కూరగాయలు సాగుచేసేవారు. అందులో ఆశించినంత ఫలితం రాకపోవటంతో గులాబీ సాగు ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన 50శాతం సబ్సిడీతో పాలీహౌజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏడు రకాల గులాబీ పూలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఫామ్ పాండ్లు ఏర్పాటు చేశారు. సాగుకు అవసరమైన 80శాతం నీటిని వాటి నుంచే ఉపయోగిస్తున్నారు.
సేకరించు విధానం
గులాబీ మొగ్గలు తొడిగే సమయంలో వాటిపై ఎలాంటి మచ్చలు పడకుండా, వాటికి తొడుగులు వేస్తున్నారు. గులాబీ మొగ్గలు ఒక దశకు వచ్చిన తర్వాత వాటిని సేకరించి కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తారు. అక్కడ ముళ్లు లేకుండా వాటిని కత్తిరించి సైజుల వారీగా గ్రేడింగ్ చేస్తారు. తర్వాత వాటిని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు.
ప్రేమికులరోజును పురస్కరించుకుని
వాలంటైన్స్ డే సందర్భంగా వివిధ దేశాల నుంచి లక్షా 50 వేల గులాబీ పువ్వుల కోసం ఆర్డర్ వచ్చిందని రైతు అజీమ్ ఉల్లా తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కువైట్, శ్రీలంకకు మాత్రమే ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కొనుగోలుదారుల ద్వారా ఎగుమతి చేసే వాళ్లమని, ప్రస్తుతం సొంత కంపెనీ పేరుతో ఎగుమతి చేస్తున్నట్లు అజీమ్ ఉల్లా తెలిపారు. నాణ్యతతో ఎగుమతి చేస్తుండటం వల్ల తాము పండించిన గులాబీ పూలకు మంచి ఆదరణ లభిస్తోందని అజీమ్ ఉల్లా సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఉద్యానం చుట్టూ.. తెగుళ్ల ముసురు