Jubilee hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్లను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతిచ్చింది. ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని రేపట్నుంచి ఐదురోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. రేపట్నుంచి జువైనల్ హోమ్‌లోనే మైనర్లను పోలీసులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలో మైనర్ల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ దుస్తుల్లోనే విచారణ జరపాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 12వ తేదీ వరకు సాదుద్దీన్ మాలిక్ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరో వైపు నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన చట్ట సవరణను జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.