మూడు రాజధానులకు వ్యతిరేకంగా... అమరావతియే పరిపాలనా రాజధానిగా కొనసాగాలని కోరుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు చేపడుతున్న నిరసన దీక్షలు 239వ రోజుకు చేరాయి. ఓ వైపు కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటిస్తూనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తమ అభిప్రాయాలను తెలిపే ప్రయత్నం చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో వినూత్న నిరసనలతో రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.
రైతుల జీవితాలతో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయంటూ.. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అంటూ రైతులు, మహిళలు వినూత్న నిరసన తెలిపారు. కొందరు భావిస్తున్నట్లు తామేమీ ప్రభుత్వం వద్ద డబ్బులు తీసుకుని భూములు ఇవ్వలేదని... రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం... పిల్లల భవిష్యత్తు కోసం భూములిచ్చామంటూ రైతులు, తేల్చి చెప్పారు. ఉద్యమాన్ని అవహేళన చేయడం భావ్యం కాదన్న మహిళలు.... రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు అమరావతికి బాసటగా నిలవాలని కోరారు.
239 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానితో తమకేమీ సంబంధం లేదని భాజపా నేతలు చెప్పడాన్ని రైతులు ఖండించారు. రామ్ మాధవ్ తాజాగా మూడు రాజధానులను తప్పుబట్టిన విషయాన్ని ప్రస్తావించిన రైతులు.... ప్రధాని మోదీ తక్షణం స్పందించాలని కోరారు. భాజపా స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని.. రాజకీయ ప్రయోజనాలు, ఎత్తుగడల కోసం రైతులను బలిపశువులను చేయవద్దని వేడుకున్నారు.
ఇదీ చదవండి: