Zomato News: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థలో పనిచేసే డెలివరీ భాగస్వామ్యుల పిల్లల విద్య కోసం సుమారు రూ.700 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగిగా తనకు ఈఎస్ఓపీ (ఎంప్లాయ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) కింద దక్కిన షేర్లను జోమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
"ఉద్యోగిగా ఈఎస్ఓపీలో భాగంగా నాకు కేటాయించిన షేర్ల విలువ సుమారు రూ.700 కోట్లు. వాటిని జోమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నాను. జోమాటో ఫౌండేషన్‌కు నిధుల సేకరణకు గల అవకాశాలను అన్వేషిస్తాం. ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తాం. ఫౌండేషన్ కోసం ప్రత్యేకంగా స్వతంత్ర పాలనా బోర్డుని ఏర్పాటు చేస్తాం."
- దీపిందర్ గోయల్, సీఈఓ, జొమాటో వ్యవస్థాపకుడు
జొమాటో పబ్లిక్ లిస్టింగ్‌లోకి వెళ్లడం కంటే ముందు దీపిందర్ గోయల్ పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయనకు కొన్ని ESOP (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) లను ఇచ్చాయి. వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడం వల్ల ఆ షేర్లను గోయల్ విక్రయించనున్నారు. గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం.. ఈ ESOPల విలువ దాదాపు 90 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.700కోట్లు.
ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు గోయల్ వెల్లడించారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేకరించిన విరాళాలను జొమాటోలో పనిచేసే డెలివరీ భాగస్వాముల పిల్లల చదువుల కోసం ఉపయోగించనున్నారు. సంస్థలో పనిచేసే డెలివరీ భాగస్వామ్యుల్లో గరిష్ఠంగా ఇద్దరు పిల్లల విద్య కోసం నిధులు కేటాయిస్తుంది. ఐదేళ్లకుపైగా ఉన్న ఉద్యోగుల పిల్లలకు రూ.50,000.. పదేళ్లు పూర్తి చేసుకుంటే రూ.లక్ష వరకు కేటాయిస్తారు. ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అమ్మాయిలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. జొమాటో ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన పిల్లలు భవిష్యత్తులో కొత్త కంపెనీలను స్థాపించాలని దీపిందర్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పందన.. రిటైల్‌లో 100% సబ్స్క్రిప్షన్