Zero cost term insurance policy : బీమా, ఆర్థిక ప్రణాళికకు పునాది లాంటిది. ముఖ్యంగా జీవిత బీమాను, సంపాదించే ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకంటే సంపాదనపరుడైన వ్యక్తిపై జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లాంటి ఆధారిత సభ్యులు ఉంటారు. వారి భవిష్యత్తు కోసం పెట్టుబడులు చేయాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది. ఒకవేళ సంపాదించే వ్యక్తి అనుకోకుండా మరణిస్తే..ఆ కుటుంబ ఆర్ధిక భవిష్యత్తు ప్రశ్నార్ధకం కాకుండా జీవిత బీమా రక్షణ కల్పిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. టర్మ్ బీమా, ఎండోమెంట్, యులిప్‌లు, మనీ బ్యాక్..ఇలా అనేక పాలసీలు ఉన్నప్పటికీ, అత్యంత సరసమైన పాలసీ అంటే టర్మ్ పాలసీనే. ఇది తక్కువ ప్రీమియంతో..ఎక్కువ హామీ మొత్తాన్ని అందిస్తుంది. అయితే, టర్మ్ బీమాలో బీమా చేసిన వ్యక్తి పాలసీ కాలపరిమితి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనం లభించదు. అందువల్ల, ఈ ప్లాన్ తో డబ్బు వృధా అవుతుందనే భ్రమలో, పాలసీ తీసుకునేందుకు కొంత మంది అయిష్టత చూపుతున్నారు.
ఈ ఆలోచనను అధిగమించడానికి, కొన్ని బీమా సంస్థలు 'రిటర్న్ ఆఫ్ ప్రీమియం' టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. అంటే బీమా చేసిన వ్యక్తి కాలపరిమితి వరకు జీవించి ఉంటే..అప్పటివరకు చెల్లించిన ప్రీమియంను తిరిగి పాలసీదారునికి ఇచ్చేస్తారు. ఇప్పుడు, ఈ కోవలోనే బీమా సంస్థలు 'జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్' పేరుతో మరొక ప్లాన్ ను అందిస్తున్నాయి. పాలసీ నుంచి నిర్ణీత సంవత్సరం తర్వాత నిష్క్రమించే అవకాశం కల్పిస్తున్నాయి.
'జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్' తీసుకున్నవారు.. నిర్ణీత సంవత్సరంలో నిష్క్రమిస్తే అప్పటి వరకు కట్టిన ప్రీమియంలన్నీ తిరిగొస్తాయి. అంటే, ఎలాంటి ఖర్చు లేకుండానే అప్పటి వరకు బీమా ప్రయోజనాన్ని పొందుతారన్నమాట! అందుకే దీన్ని జీరో-కాస్ట్ టర్మ్ ప్లాన్‌గా పేర్కొన్నారు. పాలసీ తీసుకునేటప్పుడు చాలా మంది 75-80 ఏళ్ల వయసు వచ్చే వరకు తమకు టర్మ్ ప్లాన్ ఉండాలని ఆశించి తీసుకుంటారు.
కానీ, కొంత కాలం గడిచిన తర్వాత దానిపై ఆసక్తి ఉండదు. లేదా కుటుంబంలో ఆర్థికంగా ఆధారపడిన సభ్యులు లేరని భావించినప్పుడు పాలసీని నిలిపివేసే సౌలభ్యం ఉంటుంది.పైగా అప్పటి వరకు కట్టిన ప్రీమియంలన్నీ తిరిగి రావడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పదవీ విరమణపై స్పష్టత లేనివారికి, దీర్ఘకాలిక ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం మాక్స్ లైఫ్, బజాజ్ అలియాన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ వంటి కొన్ని బీమా సంస్థలు ఈ పాలసీని అందిస్తున్నాయి.
జీరో-కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్సు ఫీచర్లు..
- ఈ ప్లాన్ ప్రకారం, పాలసీదారుడు పాలసీ మధ్యలోనే నిలిపివేయవచ్చు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అయితే, 35-40 ఏళ్ల దీర్ఘకాల ప్లాన్‌ను తీసుకుంటేనే మధ్యలో నిష్క్రమించే వెసులుబాటు లభిస్తుంది.
- తమ కుటుంబానికి దీర్ఘకాలిక రక్షణ కల్పించాలనే ఉదేశ్యంతో, 60 శాతం మంది పాలసీ హోల్డర్‌లు 70-80 ఏళ్ళ వయసు వచ్చేవరకు టర్మ్ ప్లాన్‌లను కొనసాగించాలని అనుకుంటున్నట్లు డేటా తెలుపుతోంది. అటువంటి వారు (ఆధారిత కుటుంబసభ్యులు లేరు అనుకున్నప్పుడు) పాలిసీ నుంచి సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
- నిలిపివేసిన తర్వాత, పాలసీదారుడు అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం(జీఎస్టీ మినహాయించి)లను తిరిగి పొందుతారు.
- ఈ ప్లాన్ ప్రీమియంలు సాధారణ టర్మ్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. రిటర్న్ ఆఫ్ ప్రీమియం/టీఆర్ఓపీ(TROP) ప్లాన్ మాదిరిగా ఖరీదైనవిగా ఉండవు.
- 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ పాలసీ తీసుకొనేందుకు అర్హత ఉంటుంది.
ఇదీ చదవండి: వడ్డీ మోత తప్పదా? ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో కీలక నిర్ణయాలు