2022-23 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అంతర్జాతీయ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడి, పుంజుకుంటూ ఉండడమే ఇందుకు కారణమని వివరించింది.
అక్టోబర్లో భారత దేశ వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు 2022-23కు 6.9 శాతానికి పెంచింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2022-23 జులై- సెప్టెంబర్లో దేశ జీడీపీ 6.3 శాతం మేర పెరిగింది. అమెరికా, ఐరోపా, చైనాలోని వేర్వేరు పరిణామాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడలేదని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2022-23లో ద్రవ్య లోటును జీడీపీలో 6.4శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోగలదని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది.