What Is Fractional Shares : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నవారు.. ముందు స్టాక్స్ గురించి, షేర్ల వ్యవహారాల గురించి తరచూ ఆరా తీస్తూ ఉండాలి. మార్కెట్ ట్రెండ్ గురించి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అయితే సాధారణంగా మంచి డిమాండ్ ఉన్న కంపెనీల షేర్లు భారీ విలువను కలిగి ఉంటాయి. దీంతో ఎక్కువ డబ్బులు పెట్టి షేర్లు కొనాల్సి ఉంటుంది.
ఉదాహరణకు భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 'ఎంఆర్ఎఫ్' టైర్ల కంపెనీ షేర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఒక్కో షేర్ ధర రూ.లక్షకు పైనే ఉంటుంది. అయితే వీటిని కొనుగోలు చేయాలని ఉన్నా.. ఇంత పెద్ద మొత్తం వెచ్చించి షేర్లు కొనాలి అంటే మామూలు ఇన్వెస్టర్లకు కాస్త అసాధ్యమైన వ్యవహారమే. అలాంటి వారి కోసమే ఈ ఫ్రాక్షనల్ షేర్స్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఫ్రాక్షనల్ షేర్లు అంటే ఏమిటి?
What Is Fractional Investing : ఒక షేర్ విలువ ఎక్కువగా (వేలల్లో, లక్షల్లో) ఉన్నప్పుడు, ఆ షేర్‌లోని కొంత భాగాన్ని కొనుగోలు చేయడమే ఫ్రాక్షనల్ షేర్. ఉదాహరణకు ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.1,02,069.20గా ఉంది. అయితే ఇంత భారీ మొత్తం పెట్టి ఆ కంపెనీ షేర్లను కొనలేని మదుపర్లు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ లక్షా రెండు వేల రూపాయల విలువ కలిగిన షేర్‌ను భాగాలుగా చేసి విక్రయానికి పెడతారు. అలా రూ.500, రూ.1000, రూ.5000 ఇలా చిన్న చిన్న మొత్తాల్లో ఖర్చు చేసి ఆ షేర్‌లోని కొంత భాగాన్ని కొనవచ్చు. ఇలా షేర్ విలువలో కొంత విలువను చెల్లించడం ద్వారా ఆ షేర్‌పై మదుపరులకు హక్కు ఉంటుంది. దీనినే ఫ్రాక్షనల్ షేర్లుగా పిలుస్తారు.
మరి మన దేశంలో ఫ్రాక్షనల్ షేర్లు కొనొచ్చా..?
Fractional Shares In India : భారతదేశ స్టాక్ మార్కెట్లో ఫ్రాక్షనల్ షేర్లు అనే అంశంపై చర్చ సాగుతున్నా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి అయితే ఈ షేర్ల క్రయవిక్రయాలు విదేశీ మార్కెట్లో మాత్రమే కనిపిస్తాయి. బహుశా భారత్‌లోనూ ఇటువంటి పద్ధతిని అమలు చేసే అవకాశాలు లేకపోలేవు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా చాలాకాలంగా ఉన్నాయి. మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ కూడా దీనిపై నివేదికను రూపొందించింది. త్వరలోనే భారతదేశ స్టాక్ మార్కెట్లో కూడా ఫ్రాక్షనల్ షేర్లు అందుబాటులోకి రానున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. కాగా ఫ్రాక్షనల్ షేర్లకు అమెరికా స్టాక్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.