Welfare Measures For LIC Agents And Employees : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఉద్యోగులకు, ఏజెంట్లకు తీపి కబురు చెప్పింది. వీరి సంక్షేమం కోసం పలు సంక్షేమ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎల్ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచింది. అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచింది. రెన్యువల్ కమిషన్‌కు ఎలిజిబిలిటీ కల్పించింది. మరోవైపు ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం.. ఫ్యామిలీ పెన్సన్‌ను 30 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఎల్ఐసీ ఏజెంట్స్ గ్రాట్యుటీ పెంపు!
LIC Agent Gratuity : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఎల్ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏజెంట్ల పని పరిస్థితులు మెరుగవుతాయని పేర్కొంది.
టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెరిగింది!
LIC Agent Term Insurance Coverage : ఇప్పటి వరకు ఎల్ఐసీ ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కేవలం రూ.3,000 నుంచి రూ.10,000 రేంజ్లో మాత్రమే ఉండేది. అయితే తాజాగా దీనిని రూ.25,000 నుంచి రూ.1,50,000 రేంజ్‌లోకి మారుస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఎవరైనా ఏజెంట్ దురదృష్టవశాత్తు మరణిస్తే, అతని/ఆమె కుటుంబానికి ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొంది.
రెన్యువల్ కమిషన్ ఎలిజిబిలిటీ
LIC Agent Renewal Commission Rules : ఇప్పటి వరకు పాత ఎల్ఐసీ ఏజెంట్లు తమ కమిషన్‌ను రెన్యువల్ చేసుకోవడానికి వీలులేకుండా ఉంది. కానీ ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా నిర్ణయంతో.. మళ్లీ ఎల్ఐసీ ఏజెంట్లుగా నియామకం పొందినవారు.. పాత కమిషన్‌ను రెన్యువల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ పొందుతారు. దీని వల్ల ఎల్ఐసీ ఏజెంట్లకు ఆర్థిక లబ్ధి, ఆర్థిక స్థిరత్వం లభించనుంది.
ఫ్యామిలీ పెన్షన్
LIC Employees Family Pension Rules : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా మంచి శుభవార్త చెప్పింది. ప్రధానంగా ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కోసం 30 శాతం మేర ఫ్యామిలీ పింఛన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
14 లక్షల మందికి ప్రయోజనం!
ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా నిర్ణయంతో.. దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎల్ఐసీ ఏజెంట్లకు, ఒక లక్షకు పైగా ఉన్న ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఎల్ఐసీ విస్తరణలో కీలక పాత్ర వారిదే!
ఈనాడు దేశంలో ఏదైనా బీమా సంస్థను ప్రజలు బలంగా నమ్ముతారంటే.. అది కచ్చితంగా ఎల్ఐసీ మాత్రమే. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. అయితే ఇది ఇంత విస్తృతంగా వ్యాపించడానికి కారణం మాత్రం కచ్చితంగా ఎల్ఐసీ ఏజెంట్లు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే వారి సంక్షేమం కోసం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ సంక్షేమ చర్యలను చేపట్టింది.