Vedanta founder Anil Agarwal success story : దిగ్గజ భారతీయ వ్యాపారవేత్త, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అధినేత అనిల్ అగర్వాల్.. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎలా కృషి చేయాలో మార్గ నిర్దేశం చేశారు. నిజానికి ఆయన అప్పటి వరకు తన జీవితంలో ఎన్నడూ కాలేజీకి వెళ్లింది లేదు అంటే మీరు నమ్ముతారా?
చేతిలో చిల్లిగవ్వ లేదు..
బిహార్ రాష్ట్రంలోని పట్నాలో ఓ సాధారణ మార్వాడీ వ్యాపార కుటుంబంలో అనిల్ అగర్వాల్ జన్మించారు. 19 ఏళ్ల వయస్సులోనే తన తండ్రి వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ముంబయికి వెళ్లారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాకుండా ముంబయిలో అడుగుపెట్టిన అనిల్ అగర్వాల్ 1970లో ఒక స్క్రాప్ డీలర్‌గా కెరీర్ ప్రారంభించారు. తరువాత ఆయన చేపట్టిన 9 వ్యాపారాలు కూడా వరుసగా నష్టాలపాలయ్యాయి. దీనితో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు చవిచూశారు.
కాలంతో పరుగు..
టెలిఫోన్ కేబుళ్లును సరఫరా చేసేందుకు అనిల్ అగర్వాల్ ముంబయిలోని మెరైన్లైన్లో ఒక చిన్న ఆఫీస్‌ను తెరిచారు. తరువాత లోనావాలో కాపర్రాడ్స్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఉదయమంతా మెరైన్లైన్లో పనిచేసి.. సాయంకాలం లోకల్‌ట్రైన్ ఎక్కి లోనావాలాకు వెళ్లి అక్కడ రాత్రి పనిచేసేవారు. ఇలా నిద్ర, విశ్రాంతి లేకుండా, కనీసం సమయానికి తిండి కూడా లేకుండా ఆయన చాలా కాలం శ్రమించారు. ఆకలేస్తే పల్లీలు తిని కడుపు నింపుకునేవారు. అయితే పని మీద ఉన్న అమితమైన ప్రేమ, ఉత్సాహం వల్ల అవేవీ తనను ఆపలేకపోయాయని అనిల్ అగర్వాల్ చెబుతారు.
కాపర్ స్మెల్టర్ పరిశ్రమ స్థాపన
కాపర్ వైర్ పరిశ్రమ లాభాల బాట పట్టిన వెంటనే.. అనిల్ అగర్వాల్ కాపర్ స్మెల్టర్ పరిశ్రమను స్థాపించాలని అనుకున్నారు. అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, నిధుల సమీకరణ కోసం ఒక సంవత్సరంలో కనీసం 300 రోజులపాటు ఆయన విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇంత శ్రమ పడుతున్నా తనకు ఎన్నడూ ఆలసట కలగలేదని అనిల్ అగర్వాల్ అంటారు.
కల సాకారం..
అనిల్ అగర్వాల్ ఇలా మొక్కవోని అకుంఠిత దీక్షతో ప్రయత్నించి బ్యాంకు రుణాలు పొందగలిగారు. పబ్లిక్ ఆఫరింగ్‌ల ద్వారా కాపర్ మెల్టింగ్ పరిశ్రమ స్థాపనకు అవసరమైన రూ.600 కోట్ల నిధులను సమీకరించారు. ఈ విధంగా స్థాపించిన సంస్థ.. నేడు వేల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. దాదాపు 24,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇది తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని అనిల్ అగర్వాల్ గర్వంగా చెబుతుంటారు. ఆ తరువాత ఆయన క్రమంగా వేదాంత గ్రూప్ కంపెనీలను స్థాపించి, ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. నేడు భారత్‌లో మైనింగ్ కింగ్‌గా గుర్తించబడుతున్నారు. ఈ విధంగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ భారతీయ దిగ్గజానికి.. విఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయమని కోరింది.
కేంబ్రిడ్జ్‌లో అనిల్ అగర్వాల్ ప్రసంగం
"నేను నా 20, 30 ఏళ్ల ప్రాయంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇతరులను చూస్తూ వాళ్లలా ఎప్పుడు వ్యాపారంలో విజయవంతం అవుతానా అని ఆలోచించాను. వరుసగా 9 వ్యాపారాల్లో నష్టపోయాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. కానీ నేను అకుంఠిత దీక్షతో పని చేసి విజయం సాధించాను."
- అనిల్ అగర్వాల్, వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్
స్టార్టప్‌లతో రూపు రేఖలు మారిపోతాయ్
గతంతో పోల్చితే నేటి పరిస్థితులు చాలా బాగున్నాయని అనిల్ అగర్వాల్ అంటారు. ముఖ్యంగా స్టార్టప్ కల్చర్ వల్ల నేడు ఎంతో మంది యువతీయువకులు సరికొత్త వ్యాపారాలు నిర్వహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారాయన. దీనిని మరింత ముందుకు తీసుకెళ్తే.. దేశం రూపురేఖలు కచ్చితంగా మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టుదలతో ప్రయత్నిస్తే.. విజయం తథ్యమని ఆయన నేటి యువతకు పిలుపునిచ్చారు.
"కేంబ్రిడ్జ్‌లో నా చట్టూ 20 ఏళ్ల చిరుప్రాయంలోని విద్యార్థులు గుమిగూడారు. నా చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ.. చిరునవ్వులతో తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆ తీపి జ్ఞాపకం ఇంకా నాకు గుర్తుంది."
- అనిల్ అగర్వాల్, వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్
అనిల్ అగర్వాల్ నెట్ వర్త్
అనిల్ అగర్వాల్ ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ట్విట్టర్లో సుమారు 1,63,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ ప్రకారం, అనిల్ అగర్వాల్ నెట్ వర్త్ రూ.16,000 కోట్లు. ఆయన కుటుంబ ఆస్తి విలువ సుమారు రూ.32,00,000 కోట్లు. అలాగే నేడు అక్షరాల రూ.1,48,729 కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నారు.