Twitter spam accounts: స్పామ్ అకౌంట్లపై ట్విట్టర్ ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము రోజుకు 10 లక్షల నకిలీ ఖాతాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్‌లతో గురువారం జరిగిన సమావేశంలో ఈ విధంగా పేర్కొంది. నకిలీ ఖాతాలపై ట్విట్టర్ ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ దిగ్గజ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్ ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
కొన్ని వారాల క్రితం 44 బిలియన్ డాలర్లకు సంస్థను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన మస్క్.. ట్విట్టర్‌లోని నకిలీ ఖాతాలపై నియంత్రణ లేదన్నారు. రోజువారీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ అకౌంట్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువ ఉంటేనే కొనుగోలుకు అంగీకరిస్తానని మస్క్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ట్విట్టర్ స్పామ్ అకౌంట్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువే ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే మస్క్ సంస్థను కొనుగోలు చేయడంపై ట్విట్టర్ వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి : విదేశీ విద్యపై డాలర్ దెబ్బ.. భారీగా క్షీణించిన రూపాయి విలువ