Tax Planning For TDS Financial Management : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలా మందికి టీడీఎస్ కోత ప్రారంభమయ్యింది. మూలం వద్ద పన్ను కోతనే టీడీఎస్‌గా పిలుస్తారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. అవి మన ఆర్ధిక లక్ష్యాలను తీర్చేవిధంగా ఉండాలి. అయితే చాలా మంది ఫిబ్రవరి తర్వాతే పన్ను మినహాయింపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, గడువు దగ్గరవుతున్న కొద్దీ సరైన పథకాలను ఎంపిక చేసుకోవడం కష్టమవుతుంది. హడావిడిగా ప్లాన్ చేస్తే.. పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది.
పెట్టుబడుల లక్ష్యం - పన్ను ఆదా కాదు!
చాలా మంది పన్ను ఆదా చేసుకోవడం కోసం పెట్టుబడులు పెడుతుంటారు. ఇది సరైన విధానం కాదు. వాస్తవానికి నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఎలాంటి పెట్టుబడులను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పాత పన్ను విధానంలో కొనసాగాలని అనుకుంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ముందుగా లెక్కలేసుకోండి!
ముందుగా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని ట్యాక్స్ కాలిక్యులేటర్ ఉపయోగించి.. మీకు ఎంత మేరకు పన్ను పడే అవకాశం ఉందో తెలుసుకోవాలి. ఓల్ట్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్ విధానాల్లో ఏది లాభదాయకమో తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పెట్టుబడుల గురించి ఆలోచించాలి. ఇక పాత పన్నుల విధానం ఎంచుకొని, పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు పెట్టుబడులు పెట్టాలనుకుంటే?
సెక్షన్ 80 సీ
- ఈ సెక్షన్ 80సీ పన్ను ఆదాకు ఉపయోగపడే చట్టం. ఇందులో గరిష్ఠంగా రూ.1,50,000 వరకు వివిధ పథకాల్లో మదుపు చేయవచ్చు. ముఖ్యంగా ఈపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు, వీపీఎఫ్, పీపీఎఫ్, ట్యూషన్ ఫీజులు, గృహరుణం, జీవిత బీమా ప్రీమియం ఇవన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి.
Tax Benefit On Health Insurance :
సెక్షన్ 80డీ కింద రూ.25,000 ఆరోగ్య బీమా ప్రీమియంను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక వేళ తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకున్నట్లయితే రూ.25,000 వరకు (సీనియర్ సిటిజన్లు అయితే రూ.50 వేల వరకు) అదనంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో రూ.50 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడులు మన భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా ఉండాలి. అంతేగానీ.. కేవలం పన్ను మినహాయింపుల కోసం పెట్టుబడులను ఎంచుకోవడమనేది సరికాదు. ఉదాహరణకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) మదుపు చేయవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇవి మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కనుక నష్టభయం కూడా అధికంగా ఉంటుంది. ఏ మాత్రం నష్టం భరించలేని వారికి ఇవి సరిపోవు. దీర్ఘకాలంలో పెట్టుబడి సాధనంగా ఇవి ఉపయోగపడతాయి. పన్ను ఆదా అనేది ఈ పథకాలకు వర్తించే అదనపు ప్రయోజనంగానే చూడాలి.
దీర్ఙకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు
చాలా మంది పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక లక్ష్యాల కోసం పన్ను ఆదా పథకాలను ఎంచుకుంటారు. దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగ విరమణ ప్రణాళిక లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలన్న సూత్రాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా దీర్ఘకాలంలో మంచి రాబడితోపాటు, వచ్చిన రాబడికి పన్ను ప్రయోజనాలను అందించే పథకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా మీ పోర్టుఫోలియోలో షేర్లు, స్థిరాస్తి పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్లు ఉండేలా చూసుకోవాలి.
పైన తెలిపిన పన్ను ప్రణాళికను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. పన్ను నిబంధనలు, చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనుక గత ఏడాది వేసుకున్న ప్రణాళిక ఈసారికి ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు కొత్త, పాత పన్నుల విధానాలు రెండూ అమల్లో ఉన్నాయి. వీటిలో ఏది మీకు ప్రయోజనకరమో ముందే చూసుకోవాలి. దానికి అనుగుణంగా ఆప్షన్ ఇవ్వాలి. పూర్తి వివరాల కోసం దగ్గరల్లోని ఆదాయపన్ను శాఖ వారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అయితే ఆదాయపు పన్ను భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా జీవిత బీమా పాలసీలు లాంటివి తీసుకోకూడదు. మీ అవసరానికి తగినట్లుగా సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీంతోపాటు మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే విధంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.
ఆదాయపు పన్ను.. ఏ ఫారం.. ఎవరి కోసం?
టీడీఎస్, టీసీఎస్ మధ్య తేడా ఏమిటి?.. టాక్స్ రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?