Stocks Closing Today: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడం వల్ల సూచీలు పుంజుకున్నాయి. దీంతో ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1016 పాయింట్లు పెరిగి 57 వేల 426 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17 వేల 094 వద్ద సెషన్‌ను ముగించింది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ విలువ 1.19 శాతం పెరిగి 89.54 డాలర్లకు చేరుకుంది.
లాభనష్టాల్లో ఇవే..
సెన్సెక్స్ 30 షేర్లలో 25 షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి.
రూపాయి విలువ
డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు లాభపడి 81.32గా స్థిరపడింది.
వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు.. మరోసారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేయగా తాజాగా దీనిని 7 శాతానికి కుదించింది ఆర్‌బీఐ. ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగా అంచనా వేసింది.
ఇవీ చదవండి: డీమ్యాట్, క్రెడిట్ కార్డు యూజర్స్ బీ అలర్ట్! అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ముకేశ్ అంబానీకి 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. రక్షణగా 55 మంది..