SBI MCLR Rates Hike: దేశీయ అతిపెద్ద దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును సవరించింది. అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర పెంచింది. సవరించిన రేట్లు జులై 15 నుంచి అమలవుతాయని ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఏడాది కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్‌ను 7.40 శాతం నుంచి 7.50 శాతానికి, ఆరు నెలల కాలవ్యవధికి 7.35 నుంచి 7.45 శాతానికి, రెండేళ్ల కాలవ్యవధికి 7.60 శాతం నుంచి 7.70 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెంచారు. దీంతో గృహ, వాహన, ఇతర వ్యక్తిగత రుణ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా జులైలో ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ధిష్ట కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. జులై 12 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
అలాగే, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా వివిధ కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ రేట్లు జులై 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణాలను 7.05 శాతం నుంచి 7.55 శాతం వడ్డీతో, వాహన రుణాలను 7.45 శాతం నుంచి 8.15 శాతం వడ్డీతో అందిస్తోంది. రుణగ్రహీతల వ్యక్తిగత క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణంపై వర్తించే వడ్డీ రేటును ఎస్‌బీఐ నిర్ణయిస్తుంది.
ఎంసీఎల్ఆర్ అంటే..?
ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణ రేటు. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే (మార్జినల్) వ్యయం, నిర్వహణ వ్యయం, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్), కాలపరిమితి ప్రీమియంలను పరిగణలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాబట్టి, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే అవకాశం ఉండదు. వివిధ కాలపరిమితులకు (ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల వరకు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది.
ఇవీ చదవండి: వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి!
మరమ్మతు ఇక మన ఇష్టం.. కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా 'రైట్ టు రిపేర్'