Inflation in India: దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి అని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి.
inflation data: ఆహార ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ప్రకారం 2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.38 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 7.68 శాతంగా ఉంటే.. గతేడాది ఏప్రిల్‌లో 1.96 శాతంగా ఉంది. నిజానికి ద్రవ్యోల్బణం 6శాతానికి మించకూడదని ప్రభుత్వం ఆర్బీఐకి గతంలో దిశానిర్దేశం చేసింది. అయితే, 2022 జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతానికి పైనే ఉండటం కలవరపాటుకు గురి చేస్తోంది.
దేశంలో ధరల పెరుగుదలపై రిజర్వ్ బ్యాంకు ఇదివరకే పలు సంకేతాలు ఇచ్చింది. ఊహించని రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయంగా ఆహార ధరల పెరుగుదల వంటి పరిస్థితులు దేశంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల మొదట్లో పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లోనూ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉంటాయని వెల్లడించారు.
కాగా, వచ్చే నెలలో జరగనున్న ద్రైమాసిక పరపతి సమీక్ష సమావేశంలో ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ పెంచనున్నట్లు సమాచారం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రేట్ల పెంపు అంశాన్నీ పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరపతి సమీక్ష సమావేశం లేనప్పటికీ ఈ నెల మొదట్లోనే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. 2018 ఆగస్టు తర్వాత రేట్లను పెంచడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి:
ముగిసిన ఐపాడ్ శకం.. తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్