పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ ఇలా అన్నింట్లోనూ విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మరో రంగంపై కన్నేసింది. త్వరలోనే ఐస్ క్రీం మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. తమ రిటైల్ వెంచర్స్‌లోని ఎఫ్‌ఎంజీసీ కంపెనీల స్వతంత్ర బ్రాండ్‌తో ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని సమాచారం. గతేడాది గుజరాత్‌లోనే రిలయన్స్ ఈ బ్రాండ్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోందట. ఇక ఐస్‌క్రీమ్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్‌లో కూడా తప్పక పోటీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కంపెనీ ఈ ఉత్పత్తిని తమ ఎఫ్‌ఎంజీసీ విభాగంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందట. మరోవైపు గుజరాత్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీతో చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ఈ వేసవిలోనే కంపెనీ తన సొంత ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ తమ ఇండిపెండెంట్ బ్రాండ్ పేరు మీద ఎడిబుల్ ఆయిల్స్, పప్పులు, తృణధాన్యాలు, ప్యాక్డ్ ఫుడ్స్‌ను విక్రయిస్తుంది. అయితే, రిలయన్స్ ప్రవేశంతో ఐస్ క్రీం మార్కెట్‌లో తీవ్రమైన మార్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
భారత్‌లో ఐస్‌క్రీం మార్కెట్ విలువ సుమారు రూ. 20,000 కోట్లు. ఇందులో సంఘటిత రంగం వాటా 50 శాతం. దేశ ప్రజల ఆదాయం కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో వచ్చే ఐదేళ్లలో దేశ ఐస్‌క్రీమ్ మార్కెట్ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, అనేక కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఐస్‌క్రీమ్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలు హవ్మోర్ ఐస్ క్రీమ్, వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తన సామర్థ్యాలను విస్తరిస్తూ అభివృద్ధి పథంలోకి నడుస్తున్నాయి. రిలయన్స్ ఇటీవలే డెయిరీ వెటరన్ ఆర్ఎస్ సోధిని ఎంపిక చేసుకుంది. సోధి కూడా చాలా ఏళ్లుగా అమూల్‌లో పనిచేసింది.
ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌కు టాప్ ప్లేస్..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో మళ్లీ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. 2022తో పోలిస్తే అంబానీ తన సంపదలో 8 శాతం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద నికర విలువ 84 బిలియన్ డాలర్లు. ఆయన పిల్లలు కూడా వివిధ వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఫోర్బ్స్ వివరించింది.