Rainbow Childrens Medicare IPO: మల్టీస్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్.. ఐపీఓకు వస్తోంది. ఇనీషియల్ పబ్లిష్ ఆఫర్ ఏప్రిల్ 27న ప్రారంభమై.. ఏప్రిల్ 29న ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,000 కోట్లకుపైగా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో తాజా షేర్ల ద్వారా రూ.280 కోట్లు సమీకరించనుంది.
ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు.. రమేశ్ కంచర్ల, దినేశ్ కుమార్ చిర్లా, ఆదర్శ్ కంచర్ల, పద్మ కంచర్ల సహా ఇన్వెస్టర్లు సీడీసీ గ్రూప్ లిమిటెడ్, సీడీసీ ఇండియా కూడా తమ వాటాలను విక్రయించనున్నాయి.
బ్రిటన్కు చెందిన ఫైనాన్స్ సంస్థ సీడీసీ గ్రూపు.. 1999లో హైదరాబాద్లో 50 పడకలతో తొలి రెయిన్బో పిల్లల స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించింది. అప్పటి నుంచి సమర్థంగా సేవలందిస్తూ.. మల్టీస్పెషాలిటీ పీడియాట్రిక్ సేవల్లో అగ్రగామిగా ఎదిగింది. 2021 డిసెంబర్ 20 నాటికి.. రెయిన్‌బోకు దేశంలో ఆరు నగరాల్లో 14 ఆస్పత్రులు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. మొత్తం 1500 పడకల సామర్థ్యం దీని సొంతం.
Campus Activewear IPO: ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్వేర్ ఐపీఓ కూడా ఏప్రిల్ 26న ప్రారంభం కానుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ఏప్రిల్ 25న మొదలవనుంది. ఐపీఓతో రూ. 1400 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్ ఇష్యూ ధరను రూ. 278- 292గా నిర్ణయించింది సంస్థ.
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ కోసం కూడా మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ సజావుగా సాగితే ఇప్పటికే మార్కెట్లో సందడి చేసేది. ఈ ఐపీఓను ఎప్పుడు తీసుకురావాలన్న దానిపై ప్రభుత్వం.. అతిత్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
వాస్తవానికి ఈ మార్చిలోనే ఎల్ఐసీ ఐపీఓను మార్కెట్లోకి తీసుకురావాలని కేంద్రం భావించినా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడింది. ఒకవేళ ఐపీఓకు వెళ్లాలని నిర్ణయిస్తే.. మే 12వ తేదీ వరకు కొత్తగా ఎలాంటి పత్రాలూ సెబీకి సమర్పించకుండానే ముందుకెళ్లొచ్చు. వాయిదా వేయాలని నిర్ణయిస్తే మాత్రం ఇప్పట్లో ఐపీఓకు వచ్చే సూచనలు లేవని ఆ అధికారి వివరించారు. మొత్తం 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చూడండి: మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు.. కారణం అదేనా?
దలాల్ స్ట్రీట్లో 'బుల్'రన్.. ఐటీ, ఆర్థిక షేర్ల జోష్.. సెన్సెక్స్ 870 ప్లస్