రుణ ఖాతాలను పెంచుకునే లక్ష్యంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నాయి. కొన్నిసార్లు క్రెడిట్ స్కోరునూ పట్టించుకోవడం లేదు. మీకు వ్యక్తిగత రుణం కావాలి అనుకున్నప్పుడు ఏ సంస్థను ఎంచుకోవాలన్నది ముందుగా నిర్ణయించుకోండి.
వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు గురించి పరిశీలించండి. నేరుగా సంస్థ వెబ్‌సైటులోనే ఈ వివరాలు చూడండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కేవలం వివరాలు మాత్రమే చూడండి. అన్ని సంస్థలకూ ఒకేసారి దరఖాస్తు చేయొద్దు. దీనివల్ల మీ రుణ నివేదిక ప్రభావితం అవుతుంది.
రుణం తీసుకునే తొందరలో చాలామంది నియమ నిబంధనల గురించి పట్టించుకోరు. సంస్థలను బట్టి నిబంధనలు మారుతుంటాయి. కొన్ని ముందస్తు చెల్లింపు రుసుములు విధిస్తాయి. రుణంతోపాటు బీమా పాలసీలు తీసుకోవాలని పేర్కొంటాయి. మీరు ఒప్పంద పత్రాన్ని క్షుణ్నంగా చదివినప్పుడే ఇవన్నీ అర్థం అవుతాయి.
అత్యవసరాల కోసం అప్పు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మీ అవసరం తీరొచ్చు, తీరకపోవచ్చు. ఇలాంటప్పుడు అధిక మొత్తంలో రుణం ఇచ్చే సంస్థను సంప్రదించండి. చాలా సందర్భాల్లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మనం అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మనకు అవసరం లేకపోయినా.. అర్హత ఉన్న మొత్తాన్నంతా ఖాతాలో జమ చేస్తాయి. ఈ విషయంలో ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకపోయినా అధిక మొత్తం తీసుకుంటే ఈఎంఐ భారంగా మారుతుంది.
తీసుకున్న రుణానికి సకాలంలో వాయిదాలు చెల్లించాలి. కొన్ని సంస్థలు రుణానికి దరఖాస్తు చేయగానే తిరిగి చెల్లించే సామర్థ్యంతో సంబంధం లేకుండానే అప్పు ఇచ్చేస్తాయి. సాధ్యమైనంత వరకూ మీ ఆదాయంలో 50 శాతానికి మించి మొత్తం వాయిదాలు లేకుండా చూసుకోండి. వచ్చిందంతా అప్పులకే చెల్లిస్తూ ఉంటే.. మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి. వాయిదాలను వాయిదా వేస్తుంటే.. ఆలస్యం రుసుములు, వాటిపై వడ్డీలు మరింతగా ఇబ్బంది పెడతాయి.
మంచి అప్పులు.. చెడ్డ రుణాలు.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. విలువ పెరిగే వాటి కొనుగోలు కోసం చేసే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. విలాసాలు, కోరికలను తీర్చుకునేందుకు చేసే అప్పులు ఆర్థికంగా ఎప్పుడూ భారమే. క్రెడిట్ కార్డు బిల్లులు తీర్చేందుకు వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు.