Petrol Diesel Price News : 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటర్‌పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాన్యులపై భారం తగ్గించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీ- ఓఎమ్‌సీలతో కేంద్రం ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఓఎమ్‌సీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం.
గత మూడు నెలలుగా బ్యారెల్ చమురు ధర 70-80 డాలర్ల శ్రేణిలో ఉంది. గత 20 నెలలుగా రిటైల్ ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించలేదు. ఈ నేపథ్యంలో ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలుస్తోంది. 2024లో ప్రారంభంలో పెట్రోల్ డీజిల్ ధరలను సవరించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇంధన ధరల తగ్గింపుపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ ఇటీవల చర్చలు జరిపాయని, దీనికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయానికి రెండు ఆప్షన్లు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి 5.55 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు తగ్గిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్, 2022 మేలో రెండు విడతలుగా పెట్రోల్ డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మొత్తంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.13, డీజిల్‌పై లీటరుకు రూ. 16 చొప్పున తగ్గించింది. ఫలితంగా రిటైల్ ధరలు కూడా తగ్గడం వల్ల వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది.
మరోవైపు ముడి చమురు ధరలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఈ ఏడాది మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్- BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్- HPCL) మంచి లాభాలు ఆర్జించాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ మూడు కంపెనీలు కలిసి రూ.58,198 కోట్ల లాభాలు నమోదు చేశాయి.
చమురు ధరలకు రెక్కలు.. భారత్‌లో మాత్రం నో ఛేంజ్.. ఎన్నికలయ్యాక వాత!
'పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెంచట్లేదు.. వేల కోట్లు నష్టపోతున్నాం!'