కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతి సంవత్సరం నవంబరులో తమ వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని (జీవన్ ప్రమాణ్) సమర్పించాలి. అయితే 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబరు 1 నుంచి కాకుండా అక్టోబరు 1 నుంచే వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ సూపర్ సీనియర్ పెన్షనర్లే కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ కింద పద్ధతులు ఉపయోగించొచ్చు.
పెన్షనర్ ప్రత్యక్షంగా హాజరు కావాలి
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు భౌతికంగా పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ (PDA)ల ముందు హాజరు కావడం ద్వారా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించొచ్చు.
పెన్షనర్ హాజరు కాకుండా
పెన్షనర్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసు (సీపీఏఓ) జాబితాలో సూచించిన అధికారి ఎవరైనా జీవిత ధ్రువీకరణ పత్రంపై సంతకం చేస్తే.. పెన్షనర్ బదులు ఇంకొకరు పత్రాన్ని సమర్పించొచ్చు.
జీవన్ ప్రమాణ్ పోర్టల్
పెన్షనర్ జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించొచ్చు. ఈ పోర్టల్ నుంచి జీవన్ ప్రమాణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పెన్షనర్ తన వేలిముద్రలను సమర్పించాలి. ఇందుకుగాను UIDAI తెలిపిన పరికరం అవసరం. ఈ వేలిముద్ర వేసే పరికరాన్ని ఓటీజీ కేబుల్ ద్వారా మొబైల్‌కు అనుసంధానించొచ్చు. జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న పెన్షనర్ తన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ అందించి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వేలిముద్ర పరికరాన్ని అనుసంధానించి సబ్‌మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
పోస్ట్‌మేన్ ద్వారా
పెన్షనర్లు పోస్ట్‌మేన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్‌ని ఉపయోగించొచ్చు. ఈ సదుపాయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి పోస్టాఫీసు గతంలోనే ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) సంబంధించిన జాతీయ నెట్‌వర్క్‌లో ఉన్న 1,36,999 పోస్టాఫీసు యాక్సెస్ పాయింట్లు, 1,89,000కు పైగా పోస్ట్‌మేన్‌లను, గ్రామీణ డాక్ సేవక్‌లను ఉపయోగిస్తుంది. అయితే ఈ సౌకర్యానికి పెన్షనర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోస్టింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
PSBలు అందించే డోర్‌స్టెప్ సర్వీసు
12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు) ఒక సంస్థలా ఏర్పడి పెన్షనర్ల జీవిత పత్రాలను సేకరిస్తున్నాయి. వీరు అందించే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఈ జీవన్ ప్రమాణ్ పత్రాన్నిసమర్పించొచ్చు.
ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా
UIDAI ఆధార్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫేస్ అథెంటికేషన్ సాంకేతికత ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఎలా సమర్పించాలో దశలవారీగా ఈ కింద ఉంది.
- గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆధార్ FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
- జీవన్ ప్రమాణ్ పోర్టల్ నుంచి Face (ఆండ్రాయిడ్)ను డౌన్‌లోడ్ చేయండి.
- ఆపరేటర్ అథెంటికేషన్ ఇవ్వాలి.
- పెన్షనర్ ఆధార్‌తో అథెంటికేషన్ ఇవ్వాలి.
- Sanctioning Authority, Disbursing Agencyని ఎంపిక చేసుకోవాలి, ఆధార్, మొబైల్ నంబర్, పీపీఓ నంబర్ మొదలైనవాటిని తెలపాలి.
- ముఖాన్ని స్కాన్ చేసి Submitపై క్లిక్ చేయాలి.
పై దశలు పూర్తయిన తర్వాత పెన్షనర్ లైప్ సర్టిఫికెట్ ఆమోదం పొందుతుంది.