దేశంలో తాత్కాలిక కార్మికుల (గిగ్ వర్కర్ల) సంఖ్య 2029-30 కల్లా 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 2020-21లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు, వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల (వైద్యసేవలు, బీమా, పెన్షన్)ను అందించాలని సిఫారసు చేసింది. తాత్కాలిక కార్మికులను ప్లాట్‌ఫామ్ (ఆన్‌లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై పని చేసే వాళ్లు), నాన్ ప్లాట్‌ఫామ్ (శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన సంప్రదాయ రంగాల్లో పనిచేసే కార్మికులు) అని రెండు విభాగాలుగా వర్గీకరించారు.
'ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ' పేరుతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. 2020-21లో రిటైల్ ట్రేడ్, విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు- బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగా వర్కర్లున్నారు. మధ్య తరహా నైపుణ్య ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు 47% మంది కాగా.. అధిక నైపుణ్య ఉద్యోగులు 22%, తక్కువ నైపుణ్య కార్మికులు 31 శాతంగా ఉన్నారని నివేదిక వివరించింది.
ఇదీ చదవండి:ఫిన్‌టెక్ భాగస్వామ్యంతో బ్యాంకుల రుణాలు!