ఈక్విటీ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వంటి నియంత్రణ సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం కంపెనీ ఆధారిత సమస్యగానే చూడాలని, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణించకూడదని ఆమె మరోమారు స్పష్టం చేశారు. బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు ఏ ఒక్క నమోదిత కంపెనీలో అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు. భారతీయ మార్కెట్లను నియంత్రణ సంస్థలు పకడ్బందీగా నియంత్రించే స్థితిలో ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
'మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజం'
స్టాక్ మార్కెట్‌లో అప్పుడప్పుడూ ఒడుదొడుకులు సహజంగానే వస్తుంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. వాటిలో కొన్ని మార్కెట్‌ను చిన్నగా ప్రభావితం చేస్తే, మరికొన్ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ షేర్ల పతనం వ్యవహారాన్ని నియంత్రణ సంస్థలు చక్కదిద్దుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోసపూరిత లావాదేవీలు, అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిందని అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించిన తర్వాత నుంచి ఆ గ్రూప్ షేర్లు పతనమవుతున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ మాత్రం నివేదికను ఖండించింది. జనవరి 24న నివేదిక వచ్చినప్పటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక మదుపర్లు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం లేదు: ఉదయ్ కోటక్
కార్పొరేట్ పాలనలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్ల పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తక్షణం వచ్చిన ప్రమాదం ఏమీ లేదని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ వెల్లడించారు. అయితే భారతీయ అండర్‌రైటింగ్, కెపాసిటీ బిల్డింగ్‌ను బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద భారతీయ కార్పొరేట్లు రుణం, ఈక్విటీ ఫైనాన్స్ కోసం అంతర్జాతీయ వనరులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, ఇది సవాళ్లు, ఇబ్బందులను కలిగించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.