అదానీ సంస్థలు స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడి షేర్ల విలువ పెంచుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. 20 వేల కోట్ల రూపాయల FPOను అదానీ గ్రూప్ ఉపసంహరించుకోవడం భారత ఇమేజ్ దెబ్బతీయదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్న ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని అన్నారు. మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. సెబీ ఆ పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అదానీ గ్రూప్ వాటాలు భారీగా పతనం అవుతున్న వేళ సెబీ సైతం స్పందించింది. అదానీ గ్రూప్ పేరు ప్రస్తావించకుండానే స్టాక్ మార్కెట్ సమగ్రతను నిర్థరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. వ్యక్తిగత షేర్లలో ఏదైనా అధిక అస్థిరతను పరిష్కరించడానికి అవసరమైన అన్ని నిఘా చర్యలు ఉన్నాయని స్పష్టం చేసింది. గత వారం ఓ వ్యాపార సంస్థల గ్రూప్ స్టాక్‌లలో అసాధారణ ధరల కదలికలు గమనించినట్లు సెబీ తెలిపింది. అదానీ గ్రూప్ వాటాల పతనాన్ని దృష్టిలో పెట్టుకునే సెబీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఆరోపణలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ వాటాలు భారీగా పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 సంస్థలు దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలను కేవలం ఆరు రోజుల్లో నష్టపోయాయి. అదానీ గ్రూప్ అంశంపై సెబీ చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో సెబీ దీనిపై స్పందించడం గమనార్హం.