Multi Asset Strategies : పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలనేది ప్రాథమిక ఆర్థిక సూత్రం. అయితే చాలా మంది ఈ సూత్రాన్ని విస్మరిస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక్కో వ్యక్తి ఒక్కో విధమైన పెట్టుబడులను ఇష్టపడుతూ ఉంటారు. కొందరు స్మాల్ క్యాప్ షేర్లలోనే మదుపు చేస్తూ ఉంటారు. మరికొందరు బంగారాన్ని కొంటారు. ఇంకొందరు స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపిస్తారు. కానీ ఇలా ఒకే విధమైన మార్గంలో మదుపు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. వైవిధ్యమైన పథకాల్లో మదుపు చేయడమే ఎప్పుడూ సురక్షితం అవుతుంది. దీనికోసం కచ్చితంగా మల్టీ అసెట్ వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
లక్ష్యానికి అనుగుణంగా..
మనం పెట్టే ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అయితే మన ఆర్థిక స్తోమత, నష్టాన్ని భరించే శక్తి, ఎంత కాలం కొనసాగించగలుగుతాం.. అనే అంశాల ఆధారంగా పథకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వైవిధ్యమైన పెట్టుబడులతో మంచి లాభాలు పొందగలుగుతాం. బహుళ పెట్టుబడి (మల్టీ అసెట్) పథకాల్లో మదుపు చేయడం ద్వారా నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు. పైగా మంచి రాబడులను కూడా పొందవచ్చు. ఇందుకోసం మన పోర్టుఫోలియోలో ఈక్విటీ, డెట్, బంగారం, వెండి తదితర పెట్టుబడులను సమతూకం చేయాల్సి ఉంటుంది.
నష్టభయం లేకుండా..
బహుళ పెట్టుబడి (మల్టీ అసెట్) వ్యూహంలో భాగంగా వైవిధ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే ఒక రంగం లేదా ఒక అసెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ.. మరో రంగంలోని లాభాలు మనల్ని ఆదుకుంటాయి. ఉదాహరణకు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈక్విటీల్లో బలమైన పురోగమనం కనిపిస్తుంది. అదే మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం తదితర సురక్షిత పథకాలు నష్టాలను అదుపులో ఉంచి, మీ పెట్టుబడి మొత్తం గణనీయంగా తగ్గిపోకుండా కాపాడతాయి.
దీర్ఘకాలిక పెట్టుబడులు
ఎప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే స్వల్ప, మధ్య కాలిక ఒడుదొడుకులు మన పెట్టుబడులను హరిస్తాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వస్తువుల ధరల్లో పెరుగుదల (ద్రవ్యోల్బణం), ప్రధాన ఆర్థిక వ్యవస్థల జీడీపీ మందగమనం లాంటివి మన పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అందుకే మదుపరులు కేవలం ఈక్విటీలపైనే దృష్టి సారించే బదులు, అనుకోకుండా వచ్చే అస్థిరతలను కూడా దృష్టిలో పెట్టుకొని, మల్టీ అసెట్ వ్యూహాలను అనుసరించాలి. మల్టీ అసెట్ ఫండ్ మేనేజర్లు 3 లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి మార్గాలను సూచిస్తూ ఉంటారు. కనుక మీకు వీలైనంత మేరకు మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయడం మంచిది.
లాభాలు గ్యారెంటీ!
మల్టీ అసెట్ పథకాల ప్రధాన లక్ష్యం.. వైవిధ్యమైన పెట్టుబడుల ద్వారా నష్టభయాన్ని తగ్గించడం. దీని వల్ల ఒక పెట్టుబడి పథకం తక్కువ రాబడినిస్తున్నప్పుడు, మరో పథకం అధిక రాబడినిచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండింటినీ సర్దుబాటు చేసుకుంటూ.. కాలానుగుణంగా మన పెట్టుబడుల వృద్ధికి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఫలితంగా మార్కెట్‌లో ఒడుదొడుకులు వచ్చినప్పటికీ.. స్థిరమైన రాబడిని సంపాదించవచ్చు. వాస్తవానికి మల్టీ అసెట్ క్లాస్ ఫండ్లను ఎంచుకున్నప్పుడు మదుపరులు తమ పెట్టుబడులను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు.
How To Plan For Retirement : పదవీ విరమణ ప్రణాళిక.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ప్రారంభించాలి?
7th Pay Commission DA Hike : ఉద్యోగులకు డీఏ పెంపుతో.. వేతనం ఎంత పెరుగుతోంది..?