LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ మే 4-9 తేదీల మధ్య జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎల్ఐసీ షేర్ ధరను కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. బుక్ బిల్లింగ్ పద్ధతిలో షేరు ధరల శ్రేణి రూ.902 నుంచి రూ.949 మధ్య ఉంటుందని చెప్పాయి. ఐపీవోలో పాల్గొనే ఎల్‌ఐసీ పాలసీదారులకు షేర్‌కు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్స్, సంస్థ ఉద్యోగులకు షేర్‌కు రూ.40 రాయితీ ఇవ్వనుందట. మే 4న ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ మే 9న ముగియనుంది.
సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ విలువ(ఎంబెడెడ్ వాల్యూ - భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధంగా కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైన నేపథ్యంలో ఐపీవోను ఇప్పటివరకూ వాయిదా వేసుకుంటూ వచ్చారు.
ఇదీ చదవండి: ట్విట్టర్‌ను అమ్మేశాం.. మన భవిష్యత్ ఏంటో తెలియదు: ఉద్యోగులతో సీఈఓ