LIC IPO Responce: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఎల్ఐసీకి మంచి స్పందన కనిపిస్తోంది. షేర్ల కొనుగోలు కోసం మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి రోజు బిడ్డింగ్‌లో భాగంగా.. బుధవారం మధ్యాహ్నం వరకు 0.29 రెట్లు షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్‌స్కైబ్ కావడం విశేషం. కంపెనీ ఉద్యోగుల విభాగానికి కేటాయించిన షేర్లలో 0.49 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్(క్యూఐబీ), నాన్- ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్(ఎన్ఐఐ) పోర్షన్‌కు ఇప్పటివరకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. కార్పొరేట్లు, ఇతరులు ఉండే ఈ కేటగిరీలో 6 శాతం షేర్లు మాత్రం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. తొలి రెండు గంటల్లో 31 శాతానికిపైగా షేర్లకు దరఖాస్తులు అందాయి.
రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారుల కోసం ప్రారంభమైన ఎల్‌ఐసీ ఐపీఓ మే 9న ముగుస్తుంది. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు నమోదు కానున్నాయి. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. అయితే పాలసీదార్లకు రూ.60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు. సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ.
ఇవీ చూడండి: ట్విట్టర్ యూజర్లకు మస్క్ షాక్- వారు డబ్బు చెల్లించాల్సిందే!