దేశంలోని సంస్థలు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పది శాతం మేర పెంచాలని భావిస్తున్నాయి. 2022తో పోలిస్తే ఎక్కువగానే శాలరీలను పెంచనున్నాయి. ప్రతిభ కలిగిన ఉద్యోగులకు వేతనాల పెంపు మరింత అధికంగా ఉండనుంది. ఈ విషయాలు కోర్న్ ఫెర్రీ నిర్వహించిన 'ఇండియా కాంపెన్సేషన్ సర్వే'లో వెల్లడయ్యాయి. 8లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న 818 సంస్థలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ ఫలితాలను బట్టి ఆయా సంస్థలు ఉద్యోగుల వేతనాలను 9.8శాతం మేర పెంచనున్నట్లు తెలిసింది.
కరోనా సమయంలో వేతనాల పెరుగుదల అతి తక్కువగా ఉందని సర్వేలో తేలింది. 2020లో ఉద్యోగుల వేతనాలు 6.8శాతం మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటం, భవిష్యత్ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో వేతనాలు పెరుగుతున్నట్లు సర్వే తెలిపింది. "ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించింది. మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ.. భారత జీడీపీ 6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు వేతన పెంపు.. 15 శాతం నుంచి 30 శాతం వరకు ఉండొచ్చు" అని సర్వే పేర్కొంది.
- వేతన పెరుగుదల ఇలా..
- లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్- 10.2 శాతం
- హై టెక్నాలజీ- 10.4శాతం
- సేవల రంగం- 9.8 శాతం
- ఆటోమోటివ్- 9 శాతం
- కెమికల్- 9.6శాతం
- కన్సూమర్ గూడ్స్- 9.8శాతం
- రిటైల్- 9శాతం
ఇళ్ల ధరలు సైతం
ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణ వ్యయాలు పెరగడం ఇళ్ల ధరలను ప్రభావితం చేస్తాయని ఓ సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది బిల్డర్లు అభిప్రాయపడ్డారు. మరో 32 శాతం మంది బిల్డర్లు మాత్రం.. ధరలు స్థిరంగానే ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది రెసిడెన్షియల్ ఇళ్లకు డిమాండ్ స్థిరంగానే ఉంటుందని సర్వేలో పాల్గొన్న 43శాతం మంది డెవలపర్లు అంచనా వేశారు. 31 శాతం మంది మాత్రం.. డిమాండ్ 25 శాతం వరకు పెరగొచ్చని భావిస్తున్నారు.
రియల్ఎస్టేట్ సంస్థలైన క్రెడాయ్, కొలియర్స్ ఇండియా, లియాసెస్ ఫోరాస్ ఈ సర్వే నిర్వహించాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో 341 మంది రియల్ఎస్టేట్ డెవలపర్ల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే చేపట్టారు. వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ ఇళ్ల కొనుగోలుకు డిమాండ్ తగ్గలేదని కొలియర్స్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ తెలిపారు. 'జనాభా పెరుగుదల, సంపద వృద్ధి, పట్టణాల్లో ఆవాసాలు పెరగడం వంటివి ఈ డిమాండ్‌ను నడిపిస్తాయని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై రియల్టర్లు దృష్టిసారించారు. డెవలపర్లు.. ప్రభుత్వం నుంచి సులభతర వాణిజ్యాన్ని ఆశిస్తున్నారు' అని రమేశ్ నాయర్ వివరించారు.
మాంద్యం వస్తే వ్యాపారంపై ప్రభావం పడుతుందని 46 శాతం మంది డెవలపర్లు అభిప్రాయపడ్డారు. 31 శాతం మంది తక్కువ ప్రభావమే ఉంటుందని పేర్కొనగా.. 15 శాతం మంది మాత్రం మాంద్యం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, 2022లో ఎన్నడూ చూడని స్థాయిలో విక్రయాలు జరిగాయని లియాసెస్ ఫోరాస్ ఎండీ పంకజ్ కపూర్ వెల్లడించారు. దేశంలోని పెద్ద నగరాల్లో కొత్త ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయని చెప్పారు.
కార్ల ధరలు పెంపు..
మరోవైపు.. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల ధరలను 1.1శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు జనవరి 16 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దిల్లీ ఎక్స్‌షోరూం ధరలను పరిగణలోకి తీసుకొని కొత్త రేట్లు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి రేట్లు పెంచిందీ సంస్థ.