How To Choose Best Health Insurance Policy : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పడం కష్టం. అందుకే మనం ఎలాంటి సమస్య వచ్చినా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇందుకోసం సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేసినా.. తరువాత ఇబ్బందిపడక తప్పదు. అందుకే ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలను పరిగణించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ..
సాధారణంగా సంస్థలు తమ ఉద్యోగులకు బృంద ఆరోగ్య బీమా అందిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీకంటూ ఒక సొంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. అయితే, కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేవారు, ఇప్పటికే పాలసీ ఉన్నవారూ.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మీ అవసరాలకు తగ్గట్లుగా..
మీకు, మీ కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా మీ, మీ కుటుంబ సభ్యుల వయస్సులు, ముందు నుంచే ఉన్న వ్యాధులు, వంశపారంపర్య వ్యాధులు, జీవన శైలి, కుటుంబ సభ్యుల భవిష్యత్ అవసరాలు అన్నీంటినీ దృష్టిలో ఉంచుకొని.. అందుకనుగుణంగా పాలసీ తీసుకోవాలి.
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి!
ఆరోగ్య బీమా పాలసీల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది లేకుండా చూసుకోవాలి. లేదంటే.. ఈ వేచి ఉండే సమయం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో 2 నుంచి 4 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తరువాతనే బీమా కవరేజీ లభిస్తుందనే నిబంధన ఉంటుంది. ఇది ఏయే వ్యాధులకు వర్తిస్తుందో ముందే తెలుసుకోవాలి. దీనితోపాటు ఉప పరిమితుల గురించి కూడా తెలుసుకోవాలి. సాధారణంగా ఉప పరిమితులు (సబ్ లిమిట్స్) లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఇప్పుడు కొన్ని సంస్థలు అనుబంధ పాలసీలను.. రైడర్ల రూపంలో అందిస్తున్నాయి. కాస్త ప్రీమియం పెరిగినా ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది.
సహ చెల్లింపులు..
చాలా మంది ప్రీమియం తక్కువగా ఉండాలనే ఉద్దేశంతో.. సహ చెల్లింపు నిబంధనతో పాలసీని తీసుకుంటూ ఉంటారు. కానీ, దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి రావచ్చు.
ఉదాహరణకు మీకు రూ.1,00,000 బిల్లు అయ్యిందని అనుకుందాం. దీనికి 10 శాతం సహ చెల్లింపు ఉందనుకుంటే.. అప్పుడు మీరు మీ చేతి నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి వస్తుంది. చాలా సార్లు ఇది ఆదా చేసిన ప్రీమియంతో పోలిస్తే.. అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకూ సహ చెల్లింపులు లేకుండా చూసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న మొత్తాలను చెల్లించడం కష్టం అవుతుంది.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోవాలి!
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. సదరు బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను కచ్చితంగా తెలుసుకోవాలి. స్థిరంగా ఎక్కువ క్లెయింలను పరిష్కరిస్తున్న సంస్థ నుంచి పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా సంస్థలు తక్కువ ప్రీమియానికే హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంటాయి. తీరా క్లెయిం చేసుకొనేటప్పుడు.. ఎన్నో ప్రశ్నలను వేస్తుంటాయి. ముఖ్యంగా క్లెయింను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకే మంచి పేరున్న సంస్థల నుంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.
శాశ్వత మినహాయింపులు..
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు.. అది ఏయే వ్యాధులకు చికిత్స అందిస్తుందో ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే, కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో.. కొన్ని రకాల వ్యాధులకు శాశ్వత మినహాయింపు ఉంటుంది. కొన్నింటికి నిర్ణీత కాలవ్యవధి తరువాత మినహాయింపులు వర్తిస్తాయి. అందువల్ల మీరు ఎంచుకున్న ఆరోగ్య బీమా ఏయే వ్యాధులకు, చికిత్సలకు పరిహారం ఇవ్వదో ముందే తెలుసుకోవాలి. లేదంటే, తీరా చికిత్సకు వెళ్లిన తరువాత తిరస్కరిస్తే.. మీరు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.
సమీక్షించుకోవాల్సిందే!
మీరు ఎప్పుడో తీసుకున్న పాలసీ.. నేటి అవసరాలను తీర్చలేకపోవచ్చు. కనుక, ఎప్పటికప్పుడు హెల్త్ పాలసీలను సమీక్షించుకోవడం మంచిది. అలాగే మారిన పాలసీ నిబంధనలు, ఆసుపత్రుల వివరాలను కూడా చూసుకుంటూ ఉండాలి. ఏమైనా అనుమానాలుంటే.. బీమా కంపెనీ సహాయ కేంద్రాన్ని సంప్రదించి తెలుసుకోవాలి.
అన్ని ఖర్చులు వచ్చేలా..
ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే.. బీమా సంస్థలు ఏయే ఖర్చులకు పరిహారం అందిస్తాయో తెలుసుకోకపోవడం. ఇలాంటివారు ఆసుపత్రిలో చేరిన తర్వాత, బీమా కంపెనీ కొన్ని ఖర్చులను చెల్లించేందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ఆ భారం పాలసీదారుపై పడుతుంది. కనుక, మీరు ఎంచుకున్న హెల్త్ పాలసీ.. ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా పరిహారం ఇస్తుందా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక అయిన ఖర్చులను కూడా ఇచ్చే పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా ప్రసూతి ఖర్చులు, తీవ్ర వ్యాధులకు పూర్తి పరిహారం ఇచ్చే పాలసీలను ఎంచుకోవాలి.
నగదు రహిత చికిత్స
అత్యవసర పరిస్థితుల్లో చేతుల్లో డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నగదు రహిత చికిత్స అందించే బీమా పాలసీలను ఎంచుకోవాలి. అలాగే నెట్వర్క్ ఆసుపత్రుల గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ నివాసానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటే.. ప్రథమ శ్రేణి నగరాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు.. వీలు కల్పించేలా పాలసీని తీసుకోవాలి. ఈ విధంగా అన్ని అంశాలను చెక్ చేసుకుని, మీ అవసరాలకు తగిన మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి.
క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఈ సింపుల్ టిప్స్‌తో పెంచుకోండిలా!
ATM బిజినెస్‌తో నెలకు రూ.60వేలు ఆదాయం - ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా?