How to Apply LIC Kanyadan Policy in Telugu : ప్రస్తుత రోజుల్లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న కొన్ని కుటుంబాలు.. పిల్లల చదువు, పెళ్లి ఖర్చుల వంటి విషయాలలో ఎంతో దిగాలు చెందుతూ ఉంటాయి. ప్రాధానంగా ఆడపిల్లల తల్లిదండ్రులు భవిష్యత్తులో కుమార్తె వివాహం ఎలా చేయాలని మదనపడుతుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ బీమా రంగ సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)' అద్భుతమైన పాలసీని తీసుకొచ్చింది. అదే 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'. ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎలాంటి చింత లేకుండా కుమార్తెకి కన్యాదానం చేసేలా ఈ కన్యాదాన్ పాలసీని ఎల్ఐసీ రూపొందించింది.
LIC Kanyadan Policy Details : ఈ ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ కేవలం ఆడపిల్లల వివాహానికి మాత్రమే కాకుండా వారి బంగారు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసి.. కుమార్తె పెళ్లి సమయానికి లక్షల డబ్బును మీరు పొందవచ్చు. ముఖ్యంగా ఈ పాలసీలో కుమార్తె, తండ్రి మాత్రమే భాగస్వామ్యులుగా ఉంటారు. ఇంతకీ 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ(LIC Kanyadan Policy)' అర్హతలు ఏంటి, ఎంత ప్రీమియం చెల్లించాలి, ఏ విధంగా ఈ పాలసీకి అప్లై చేసుకోవాలి, దాని వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
LIC Kanyadan Policy Eligibilities :
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకునేందుకు అర్హతలివే :
- ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ వ్యవధి 13 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది.
- అయితే తండ్రి కుమార్తె కోసం ఈ పాలసీ తీసుకోవాలంటే ఆయన వయసు 18 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి.
- గరిష్ఠ మెచ్యురిటీ వయసును ఈ పాలసీలో 65 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు.
- ఇక ఈ పాలసీని అదే కూతురు పేరు మీద తీసుకోవాలంటే ఆమె వయసు 1 నుంచి 10 సంవత్సరాల లోపు ఉండాలి.
- ఎన్ఆర్ఐలు కూడా తమ కుమార్తె పెళ్లి కోసం ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు.
- ఒక్క అమ్మాయి పేరు మీద రెండు ఖాతాలు తెరవడానికి వీలు లేదు.
ఈ పాలసీకి ఏవిధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
How to Apply LIC Kanyadan Policy : ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అప్లై చేసుకోవాలని ఆసక్తి గల వారు మొదట దగ్గరలోని ఎల్ఐసీ ఆఫీస్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి. ఆయన మీకు ఈ పాలసీకి చెందిన వివరాలు చెప్తారు. అప్పుడు మీ ఆదాయాన్ని బట్టి ప్రీమియం చెల్లింపులను ఎంపిక చేసుకోవాలి. ఇంక ఈ పాలసీకి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఎల్ఐసీ(LIC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
నెలకు రూ.12 వేల పెన్షన్!.. ఈ LIC స్కీమ్ గురించి మీకు తెలుసా?
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో ఎంత డబ్బు పెట్టుబడిగా పెట్టాలంటే...
ఈ పాలసీ లబ్ధిదారులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి వార్షిక చెల్లింపులతో పాటు రోజూ వారీ చెల్లింపులను అందిస్తుంది. ఇందులో రోజూ వారీ ప్రీమియం రూ.75నుంచి మొదలవుతుంది. అదే విధంగా నెలవారీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను ఈ పాలసీ అందిస్తోంది. మొత్తంగా 25 ఏళ్ల వ్యవధి కలిగిన ఈ పాలసీలో చేరాలనుకునేవారు కేవలం 22 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 13 ఏళ్ల నుంచి ప్రారంభమయ్యే ఈ పాలసీ ప్లాన్‌కు నిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా మీ పాలసీ మెచ్యురిటీ తర్వాత మీరు కుమార్తె వివాహ సమయానికి భారీ మొత్తంలో నగదును లబ్ధి పొందుతారు. ఉదాహరణకు మీరు రోజూ రూ.75లు ఆదా చేస్తే.. పాలసీ వ్యవధి ముగిసే సమయానికి సుమారు రూ.14.5 లక్షలు.. అదే రోజూ రూ.151లు పొదుపు చేస్తే మెచ్యురిటీ సమయానికి రూ.31 లక్షలు వరకు నగదును అందుకోవచ్చు.
LIC Kanyadan Policy Benefits :
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ద్వారా కలిగే బెనిఫిట్స్..
- ఈ పాలసీ భాగంగా ప్రమాదవశాత్తు పాలసీ మెచ్యూరిటీ కాకముందే తండ్రి మరణిస్తే.. అతడి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.
- పాలసీ తీసుకున్నాక కొంత కాలానికే తండ్రి మరణిస్తే మిగతా కాలానికి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
- అలాగే ప్రీమియం మొత్తం మాఫీ అవ్వడంతో పాటు ఈ పాలసీ ఉచితంగా అమలు అవుతుంది.
- అదే విధంగా పాలసీ మిగిలిన కాలానికి ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో నుంచి 10శాతం డబ్బును కుమార్తె పొందవచ్చు.
- అలాగే పాలసీ వ్యవధి ముగిశాక తండ్రి కడుతున్న ఆ పాలసీ మొత్తం డబ్బును నామినీకి అంటే కూతురుకు అందజేస్తారు.
- ఈ పాలసీ వ్యవధి ముగిశాక దీని ద్వారా అందే మొత్తం డబ్బును నామినీకి అంటే కూతురుకు అందజేస్తారు.
- ఈ పాలసీ తీసుకున్నాక.. లబ్ధిదారుడు(తండ్రి) ప్రమాదవశాత్తు మరణిస్తే గనుక రూ.10 లక్షలు, అదే సహజ మరణమైతే రూ.5 లక్షలు కుటుంబానికి చెల్లిస్తారు.
- కుమార్తె పేరుపై తీసుకునే ఈ పాలసీలో అమ్మాయి ఉన్నత చదవుల కోసం ప్లాన్ అమౌంట్లో నుంచి గరిష్ఠంగా 50 శాతం మేర నగదును ఉపసంహరించుకోవచ్చు. అప్పటికి ఆమెకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ద్వారా లోన్ సౌకర్యం కూడా ఉంది. మూడేళ్ల నుంచి అనేక రకాల రుణాలను కూడా పొందొచ్చు.
LIC Aadhaar Shila Policy : ఎల్ఐసీ 'సూపర్ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్‌డ్రా!