Education Loan Tips : నేటి కాలంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు విద్యారుణాలు లభిస్తుండడం నిజంగా ఒక వరం అని చెప్పాలి. ఒకప్పుడు ఉన్నత విద్య అభ్యసించాలంటే.. ఇంట్లోని డబ్బులు, బంగారం, వస్తువులు అమ్మాల్సి వచ్చేది. కానీ నేడు ఆ సమస్య లేదు. చాలా బ్యాంకులు లేదా రుణ సంస్థలు విద్యారుణాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు విద్యా రుణాలను పూచీకత్తుతో ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హామీ రహితంగా కూడా అందిస్తున్నాయి.
విదేశీ చదువులకు రుణాలు
Foreign education loan : నేడు చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో విద్యారుణాలు అందిస్తున్నాయి. కనుక సరైన ప్రణాళికను అనుసరించి విద్యారుణాలు తీసుకున్నట్లయితే, ఈ లోన్ భారాన్ని చాలా సులువుగా, తక్కువ కాలంలో తీర్చేసి, జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యారుణాన్ని సులభంగా తిరిగి చెల్లించడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం?
రీపేమెంట్ ప్లాన్!
Education loan repayment : విద్యారుణాలను తిరిగి చెల్లించేందుకు సరైన రీపేమెంట్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. వాస్తవానికి లోన్ ఇచ్చిన బ్యాంకు.. రీపేమెంట్ కోసం కొన్ని ఆప్షన్లను ఇస్తుంది. వాటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మీ ఆదాయానికి, బడ్జెట్‌కు అనుగుణమైన రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తక్కువ కాలవ్యవధి
Education loan tenure : చాలా బ్యాంకులు 7 నుంచి 15 ఏళ్ల కాలవ్యవధిలో విద్యా రుణాలు తిరిగి చెల్లించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఎక్కువ కాలవ్యవధికి రుణాలు తీసుకుంటే ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ ఓవరాల్‌గా మీరు కట్టే వడ్డీ బాగా పెరిగిపోతుంది. ఒక వేళ తక్కువ కాలవ్యవధికి రుణాలు తీసుకుంటే.. ఓవరాల్‌గా కట్టే వడ్డీ తగ్గుతుంది. కానీ ఈఎంఐ భారం భారీగా పెరిగిపోతుంది. అందువల్ల మీకు వచ్చే ఆదాయాన్ని అనుసరించి, మీకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో రుణం చెల్లించే కాలవ్యవధిని ఎంచుకోవడం మంచిది.
మీరు ప్రతి నెలా రుణవాయిదాలు చెల్లించే సమయంలో, వీలైనంత ఎక్కువ మొత్తం చెల్లించడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ రుణ కాలవ్యవధి తగ్గుతుంది. అదే విధంగా భవిష్యత్‌లో వడ్డీ భారం కూడా ఘణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.
నోట్ : ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేటుతో విద్యారుణాలు తీసుకుంటే.. ప్రీపేమెంట్ ఛార్జీలు విధించరు. కానీ ఫిక్స్డ్ వడ్డీ రేటులతో విద్యారుణాలు తీసుకుంటే.. ప్రీపేమెంట్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యారుణం తీసుకునే ముందే ఈ విషయం గురించి ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోండి.
ఆటో డెబిట్స్
Education loan auto debit : ఎప్పుడూ రుణ వాయిదాలు సకాలంలో చెల్లించాలి. లేకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ఆలస్య రుసుములు కూడా భరించాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటోడెబిట్ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఈఎంఐ చెల్లింపులు సకాలంలో జరిగిపోతాయి. ఫలితంగా మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది. భవిష్యత్‌లో కొత్త రుణాలు పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.
మారటోరియం
Moratorium period interest : మారటోరియం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి విద్యారుణం తీసుకునేటప్పుడు, వెంటనే తిరిగి చెల్లింపులు ప్రారంభం కావు. దీనికి కొంత మారటోరియం వ్యవధి ఉంటుంది. సాధారణంగా మారటోరియం వ్యవధి.. కోర్సు పూర్తి చేసిన 6 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు ఉంటుంది. వాస్తవానికి ఈ సమయంలో మీరు రుణ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు తీసుకున్న రుణంపై వడ్డీ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మారటోరియం పూర్తి కాకముందే.. ఉద్యోగం వెతుక్కోవడం మంచిది. దీని వల్ల మీపై అకస్మాత్తుగా ఈఎంఐ భారం పడకుండా ఉంటుంది. అలాగే ఈఎంఐలు సకాలంలో చెల్లించడానికి వీలవుతుంది. దీనిని మరింత సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.
మీరు 2 ఏళ్ల కోర్సు చదవడం కోసం 8 శాతం వడ్డీ రేటుతో రూ.10 లక్షలు విద్యారుణంగా తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఈ రూ.10 లక్షలపై సంవత్సరానికి రూ.80,000 వడ్డీ జనరేట్ అవుతుంది. రెండు సంవత్సరాలకు ఈ వడ్డీ రూ.1,60,000 అవుతుంది. కానీ ఇక్కడ మీరొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే, మీ ఈఎంఐలు చెల్లింపులు ప్రారంభమైనప్పుడు ఈ వడ్డీ మొత్తం.. లోన్ మొత్తానికి కలుస్తుంది. అంటే మీరు చెల్లించాల్సిన మొత్తం రుణం రూ.11,60,000 అవుతుంది. అప్పుడు ఈ మొత్తం రుణానికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మీపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతుంది. అందుకే మారటోరియం పీరియడ్‌లోనూ.. వీలైతే వడ్డీలు చెల్లించడం మంచి పద్ధతి అవుతుంది. దీని వల్ల మీపై రుణభారం తగ్గుతుంది. మరో ముఖ్యమైన విషయం.. మారటోరియం వ్యవధిలో చెల్లింపులను ప్రారంభిస్తే.. కొన్ని బ్యాంకులు 1 శాతం వరకు వడ్డీ రాయితీని అందిస్తుంటాయి.
పార్ట్ టైమ్ జాబ్!
Part time job benefits : చదువుకునే సమయంలో మీ అభిరుచికి అనుగుణంగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తే, అనుభవం రావడం సహా, మీ ఖర్చులకు కూడా డబ్బులు వస్తాయి. వీటితో మీ విద్యారుణం వాయిదాలు కూడా చెల్లించుకోవచ్చు. ఇది మీకు ఆర్థికంగా బాగా హెల్ప్ అవుతుంది.
బడ్జెట్
Home budget plan : విద్య పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించిన తరువాత మీ ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ను రూపొందించుకోండి. ముఖ్యంగా మీ ఆదాయంలో 50 శాతం ఇంటి అవసరాల కోసం, 30 శాతం మీ సరదాలు, సంతోషాల కోసం వినియోగించండి. కానీ మిగతా 20 శాతాన్ని పొదుపు, మదుపుల కోసం, అప్పులు తీర్చడం కోసం కేటాయించండి.
రీఫైనాన్స్
Education loan refinance : మీరు మంచి ఉద్యోగం సంపాదించి, బాగా సంపాదిస్తున్నట్లు అయితే ముందుగానే బ్యాంకు రుణం తీర్చే ప్రయత్నం చేయండి. లేదంటే, తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకుకు.. మీ ఎడ్యుకేషన్ లోన్‌ను బదిలీ చేసుకోండి. దీని వల్ల మీపై రుణ భారం తగ్గుతుంది.