ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) చందాదారుల అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా విధించిన గడువు ఈ నెల 3(బుధవారం)తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈమేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
సుప్రీంకోర్టు గతేడాది నవంబరు 4న జారీచేసిన ఆదేశాలను అనుసరించి ఈపీఎఫ్‌ఓ పింఛనుదారుల నుంచి ఆప్షన్ వాలిడేషన్, జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను స్వీకరించడానికి ఆన్‌లైన్ ద్వారా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన పింఛనుదారులంతా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది. పలు కారణాలతో అధిక పింఛనుకు అప్లై చేసుకునే వాళ్లకు ఈ నిర్ణయంతో మేలు చేకూరనుంది. దరఖాస్తుల అప్‌లోడ్‌లో ఇప్పటివరకు పింఛనుదారులు, చందాదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి సంఘాలు ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా జూన్ 26 వరకు దరఖాస్తుకు సమయమివ్వాలని భావించినట్లు ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.
ఎవరు అర్హులు..?
ఉద్యోగుల పింఛను పథకం-1995 చట్టసవరణకు ముందుగా (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ.. ఈపీఎస్ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారు అర్హులు. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు వీలు కల్పించింది.
ఆన్లైన్లో అప్లై చేసుకొండిలా..
ఈపీఎఫ్‌వో వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్ మెంటర్ పోర్టల్ హోంపేజీలో ప్రత్యేక లింకును ఏర్పాటు చేసింది సంస్థ. దీనికి దరఖాస్తును చేసుకునే వారు హోంపేజిలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకును క్లిక్ చేయాలి. అనంతరం ఈపీఎస్ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తును క్లిక్ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) ఖాతాద్వారా పూర్తి చేయాలి. ఈపీఎఫ్‌వో రికార్డుల ప్రకారం చందాదారు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబరును వినియోగించాలి. చందాదారు వివరాలన్నీ ఇలా మొత్తం 4 దశల్లో పూర్తి చేశాక దరఖాస్తు చేసుకున్నట్లుగా ఓ ప్రత్యేక నంబరు వస్తుంది.