Gas Cylinder Price : ఒకటో తేదీ వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,856కు చేరింది. తగ్గించిన ధరలు నేటి (సోమవారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దిల్లీలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028 నుంచి రూ.1,856కు చేరింది.
గత నెల ఏప్రిల్ 1వ తేదీన కూడా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028కు చేరింది. అప్పుడు కూడా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు.. ఈ ఏడాది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రెండుసార్లు పెంచగా.. రెండుసార్లు తగ్గించాయి. మార్చి నెల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. అంతకుముందు జనవరి 1న యూనిట్‌కు రూ.25 పెంచాయి. ప్రస్తుతం దీని ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి.
Cylinder Price : కమర్షియల్ సిలిండర్ల ధరలను గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన చివరి సారిగా రూ.91.50 తగ్గించాయి చమురు కంపెనీలు. అంతకు ముందు ఆగస్ట్ 1న రూ.36 తగ్గించాయి. అదే సంవత్సరం జులై 6న 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై యూనిట్‌కు రూ.8.5 తగ్గించాయి.
అయితే గృహాల్లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103గా ఉంది. మార్చి నెలలో చమురు కంపెనీలు ఈ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచగా.. ప్రస్తుతం దీని ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా, చమురు కంపెనీలన్నీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తాయి.