Gas Agency How To Open : ప్రస్తుత రోజుల్లో సంపాదన సరిపోక.. చాలా మంది ఒకటికి మించి ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. మరికొంతమంది వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ ఇబ్బందులు లేకుండా.. ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకుంటే వారికి ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఎల్‌పీజీ గ్యాస్‌కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ ఏజెన్సీ చక్కగా నడిపిస్తే లాభాలు భారీగానే వస్తాయి. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ బ్యాంకుల ద్వారా సులభంగా లోన్లు పొందొచ్చు. మరి గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలంటే ఏం చేయాలి? అర్హతలేంటి? లైసెన్స్ ఎలా పొందాలి? అప్లికేషన్ ఫీజు ఎంత? వంటి పూర్తి వివరాలు మీకోసం.
4 రకాల డిస్ట్రిబ్యూటర్స్..
Gas Agency How To Apply : ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలనుకుంటే.. ముందు వారు డిస్ట్రిబ్యూటర్షిప్ను ఎంపిక చేసుకోవాలి. అర్బన్, రూర్బన్, రూరల్, హార్డ్ టు రీజినల్ అనే నాలుగు డిస్ట్రిబ్యూటర్స్‌లో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు.. ఏజెన్సీ ఏర్పాటు కోసం కచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధరించుకోవాలి. అక్కడ సర్వే కూడా చేయించుకోవాలి. ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని.. అక్కడ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
అర్హతలు ఏంటి?
Gas Dealership Apply : ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలనుకుంటే కొన్ని అర్హతలు ఉండాలి. దరఖాస్తుదారుడి వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. దరఖాస్తుదారుడి కుటుంబంలోని ఏ ఒక్క సభ్యుడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో(ఉదా- IOCL, HPCL) ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
ఎంత కట్టాలి?
Gas Agency Dealership Cost : గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం.. దరఖాస్తు చేసే సమయంలో రూ.10వేలు కట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. అంటే మళ్లీ ఉపసంహరించుకుంటే ఆ డబ్బు మొత్తం వెనక్కి రాదు.
డిస్ట్రిబ్యూటర్‌షిప్ అందించే కంపెనీలివే..
New Gas Agency Dealership Advertisement : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ గ్యాస్ వంటి కంపెనీలు డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను ఇస్తున్నాయి. ఎక్కువగా ఈ కంపెనీలు వార్తాపత్రికలు, వివిధ మీడియా ఛానళ్ల ద్వారా గ్యాస్ ఏజెన్సీ ప్రకటనలు జారీ చేస్తుంటాయి. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో అర్హత గల అభ్యర్థులు, ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లైసెన్స్ ఎలా పొందాలి?
Gas Agency Licence Process : ముందుగా.. ఎల్‌పీజీ అధికారిక వెబ్‌సైట్ https://www.lpgvitarakchayan.inలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీ వ్యక్తిగత ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. కంపెనీలు దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత దరఖాస్తుదారుడు అందించిన వివరాల్ని ధ్రువీకరిస్తారు. అంతా సరిగ్గా ఉంటే.. కంపెనీ వారికి ఒక లెటర్ జారీ చేస్తుంది. అప్పుడు దరఖాస్తుదారుడు.. డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. తర్వాత దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ ఏజెన్సీ రిజిస్టర్ చేస్తారు.