ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా నిలిపివేసిన బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సేవల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. నవంబరు 29న దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అప్పటికల్లా ఎటువంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నామన్నారు.
నెలకు 8 డాలర్లు చెల్లిస్తే.. కొన్ని అదనపు ప్రయోజనాలను అందించేలా బ్లూటిక్ సేవల్ని ట్విట్టర్ నవంబరు 6న ప్రారంభించింది. కానీ, వేరే వ్యక్తులు, సంస్థల పేరిట కొంతమంది నకిలీ ఖాతాలను సృష్టించి.. వాటికి బ్లూటిక్ పొందడం వల్ల గందరగోళం తలెత్తింది. ఏవి నిజమైన ఖాతాలో, ఏవి కావో తెలుసుకునేందుకు యూజర్లు తికమకపడ్డారు. దీంతో ట్విట్టర్ తాత్కాలికంగా ఈ సేవల్ని నిలిపివేసింది.
భారత్‌లో ట్విట్టర్ చాలా స్లో..
భారత్‌లో ట్విట్టర్ చాలా నెమ్మదిగా పనిచేస్తోందని స్వయంగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇండోనేసియా సహా మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. హోంలైన్ ట్వీట్లు రీఫ్రెష్ కావడానికి 10- 15 సెకన్లు పడుతోందని తెలిపారు. కొన్నిసార్లు పూర్తిగా పనిచేయడం లేదన్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతోందన్నారు.
అయితే, బ్యాండ్‌విడ్త్, లేటెన్సీ, యాప్ ఈ మూడు కారణాలతో ఎంతెంత జాప్యం జరుగుతుందో తెలియాల్సి ఉందన్నారు మస్క్. సంస్థలోని ఇంజినీర్లు చెప్పినట్లు కంటే రీఫ్రెష్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటోందన్నారు. అమెరికాలో 2 సెకన్లు పడితే.. భారత్‌లో మాత్రం 20 సెకన్ల వరకు సమయం తీసుకుంటోందన్నారు. ట్విట్టర్ కొన్ని దేశాల్లో చాలా నెమ్మదిగా పనిచేస్తోందని.. అందుకు తనని క్షమించాలని ఇటీవలే మస్క్ వినియోగదారులను కోరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే విషయాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించడం గమనార్హం.